కోర్టు తీర్పు పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సిందే.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

by Disha Web |
కోర్టు తీర్పు పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సిందే.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, ఏపీ బ్యూరో: కోర్టు తీర్పు పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సిందేనని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పులు క్షేత్ర స్థాయిలో అమలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు తీర్పు పట్టించుకోని అధికారులపై, ధర్మాసనం చర్యలను ఆయన సమర్థించారు. సీఎం జగన్‌ నియమించుకున్న సలహాదారుల్లో చాలా మందికి చదువు రాదనీ, సంతకాల కోసం మాత్రమే అధికారులను వాడుకుంటున్నారని జేసీ సంచలన ఆరోపణలు చేశారు.

హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, కింద స్థాయిలో అమలు కావటం లేదని మండిపడ్డారు. కాగా.. కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టుకు ఐఎఎస్‌లు క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్‌లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఐఏఎస్‌లు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది. దీంతో వారు కోర్టును క్షమాపణలు కోరటంతో, సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్‌లను కోర్టు ఆదేశించింది. ప్రతి నెల ఏదో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్‌లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed