తెల్లవారితే ఆలయం రీఓపెన్.. యాదాద్రిలో ఘరానా మోసం!

by Disha Web Desk 2 |
తెల్లవారితే ఆలయం రీఓపెన్.. యాదాద్రిలో ఘరానా మోసం!
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయం పునఃప్రారంభం అవుతున్న తరుణంలో గుడిలో ఉద్యోగాలంటూ మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. యాదాద్రి గుడిలో పని చేయడానికి 50 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కావాలని పేర్కొంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు చక్కర్లు కొట్టడంతో వందల సంఖ్యలో యువత యాదగిరిగుట్టకు తరలివచ్చారు. గండిచెరువు దిగువన నూతనంగా నిర్మించిన కల్యాణకట్ట బిల్డింగ్‌లో శుక్రవారం 'చెక్ సెక్యూరిటీ ఫోర్స్' సంస్థ పేరుతో ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. శనివారం రాతపరీక్షకు హాజరుకావాలని చెప్పారు. ఉద్యోగాల విషయం తెలిసి అప్లికేషన్లు ఇవ్వనివారు సైతం శనివారం వందలాదిగా తరలివచ్చారు. కొందరు ఆలస్యంగా రావడంతో రిక్రూట్‌మెంట్స్ అయిపోయాయని సంస్థ ప్రతినిధి బాలాజీ చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు రాత పరీక్షల కోసం అక్కడే సాయంత్రం వరకు నిరీక్షించారు. విషయం బయటకు పొక్కడంతో అక్కడినుంచి చెక్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిధి పరార్ అయ్యారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఫోన్‌లో బాలాజీని సంప్రదించగా కంప్యూటర్ ఆపరేటర్లను తీసుకోండని ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధులు చెప్పారన్నారు.

ఇదే విషయంపై ఈసీఐఎల్ కన్సల్టెంట్ వేణును ఫోన్‌లో సంప్రదించగా.. కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తులు తీసుకోలేదని, మూడు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్లుగా స్వామివారికి ఉచిత సేవ చేయాలనుకునే వారినుంచి అప్లికేషన్లు తీసుకున్నామని చెప్పారు. అంతే తప్ప యాదాద్రి ఆలయంలో కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం కాదని అన్నారు. కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు దుష్ప్రచారం కావడంతో ప్రక్రియ మొత్తం క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఓవైపు నియామకాలు అయిపోయాయని చెక్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిధి చెప్తుండటం, మరోవైపు మూడు నెలలు ఉచితంగా సేవ చేయాలనుకునే వారి నుంచే దరఖాస్తులు తీసుకున్నామని ఈసీఐఎల్ కన్సల్టెంట్ వేణు చెప్తుండటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల యాదాద్రి దేవస్థానం నుంచి వైటీడీఏకు ప్రమోషన్‌పై బదిలీ అయిన ఓ ఉన్నతాధికారిహస్తం ఇందులో ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం బయటకు పొక్కకుంటే దరఖాస్తుదారుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసేవారని మాట్లాడుకుంటున్నారు.

వైటీడీఏ ఉద్యోగిపై ఎమ్మెల్యే ఆగ్రహం

యాదాద్రిలో ఉద్యోగాల పేరుతో యువతకు ఎర వేస్తూ డబ్బులు దండుకోవాలని చూస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వైటీడీఏ ఆఫీసర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలయ ఉద్ఘాటన ఏర్పాట్లను పరిశీలించడానికి యాదాద్రికి ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి వచ్చారు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి కొండపైకి వచ్చిన ఎమ్మెల్యే సునీతకు సంబంధిత ఆఫీసర్ ఎదురుకావడంతో ఫుల్ సీరియస్ అయ్యారు. 'నీ కనుసన్నల్లోనే దొంగ ఉద్యోగాల తంతు జరుగుతోంది. ఎవ్వరినడిగినా నీ పేరే చెప్తున్నారు. నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాల నియామకాలేంటి?" అని సంబంధిత ఆఫీసర్‌పై మండిపడ్డారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదు: ఆలయ ఈఓ గీత

యాదాద్రి దేవస్థానంలో పని చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్లు కావాలని తాము ఎలాంటి నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇవ్వలేదు. ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఆదేశించిందే తప్ప ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు, నోటిఫికేషన్లు జారీ చేయలేదు. కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం ఎవరో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిసింది. సంబంధిత సంస్థ, వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు చేపడతాం. ఇలాంటి మోసగాళ్ల ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.


దేవస్థాన అభివృద్ధిలో అవకతవకలపై హైకోర్టులో పీల్ వేస్తాం: సీపీఐ

యాదాద్రిలో అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని పార్టీ పక్షాన హైకోర్టులో పీల్ వేయనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తెలిపారు. ఆదివారం గుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుండి దేవస్థాన ఈఓ చర్యలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఈఓపై చర్యలు తీసుకోవాలని తాము వివిధ రూపాల్లో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరికి ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని అక్కడి నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి ఈఓపై విచారణ చేయాలని ఆర్డర్ వచ్చినా ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ కట్టలో అధికారులకు తెలియకుండా ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. కొండపైన నూతనంగా వచ్చే ఉద్యోగాలను పట్టణ నిరుద్యోగులతో పాటు జిల్లా వాసులకు ఇవ్వాలన్నారు. ఈఓకి తెలియకుండా కల్యాణ కట్టలో ఇంటర్వ్యూలు జరగడం అసంభవమన్నారు. లోపాయికారీ ఉద్యోగాలకి అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. దేవస్థానంలో జరిగే అన్ని విషయాలపై రాష్ర్ట ముఖ్యమంత్రికి పార్టీ ఆధ్వర్యంలో సమగ్రంగా లేఖ రాస్తమన్నారు. ఈ మీడియా సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య సీపీఐ పట్టణ కార్యదర్శి గోపగని రాజు, నాయకులు రాయగిరి బాలకిషన్, మాటూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed