చమురు ఎగుమతులపై పన్నులు విధించిన కేంద్రం!

by Dishanational1 |
చమురు ఎగుమతులపై పన్నులు విధించిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: ఇతర దేశాలకు పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యుయెల్‌లను ఎగుమతి చేసే చమురు సంస్థలపై కేంద్రం పన్ను భారం మోపింది. విదేశాలకు ఎగుమతి చేసే ఈ ఇంధనాలపై ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ విధిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. లీటర్ పెట్రోల్, జెట్ ఫ్యుయెల్‌లపై రూ. 6, డీజిల్ లీటర్‌కు రూ. 13 ఎగుమతి పన్నును విధిస్తూ ఆర్థిక శాఖా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఒక్కో టన్ను ముడి చమురుపై రూ. 23,250 అదనపు పన్ను విధించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే వేదాంత, ఓఎన్‌జీసీ కంపెనీల ముడి చమురుపై అదనపు పన్ను విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ అనేది కంపెనీలు కొత్త పెట్టుబడులు, విస్తరణ ప్రక్రియ ద్వారా కాకుండా అందుకునే అధిక లాభాలపై విధించే అదనపు పన్ను.

ఈ ఏడాది ప్రారంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాకు చెందిన చమురు విషయంలో పలు దేశాలు ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో భారత్‌కు రష్యా రాయితీతో కూడిన చమురును విక్రయిస్తోంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ లాంటి ప్రైవేట్ చమురు కంపెనీలు రష్యా నుంచి తక్కువకు కొని శుద్ధి అనంతరం ఇతర దేశాలకు సాధారణ ధరలతో ఎగుమతి చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ చమురు సంస్థలూ ఇలాగే చేస్తున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తెచ్చింది. దీనిపై వచ్చిన ఆదాయం ద్వారా దేశీయ వాహనదారులకు తక్కువ ధరలో ఇంధనాన్ని అందించవచ్చు. కాగా, దేశీయ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా సహా ప్రైవేట్ కంపెనీలు ఏడాదికి 29 మిలియన్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో కేంద్రం అదనపు విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 67 వేల కోట్లకు పైగా ఆదాయం లభించనుంది.

Next Story

Most Viewed