ప్రభుత్వ వైద్యం.. ఇక్కడ ఆయమ్మలే వైద్యులు.. నెలనెలా జీతాలకు డాక్టర్స్

by Web Desk |
ప్రభుత్వ వైద్యం.. ఇక్కడ ఆయమ్మలే వైద్యులు.. నెలనెలా జీతాలకు డాక్టర్స్
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది. డుమ్మాలు, సమయపాలన తీవ్ర నిర్లక్ష్యం వెరసి గ్రామీణ నిరుపేదలకు, ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు స్వీపర్లు, ఆయమ్మలే వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా సోమవారం ఓ ప్రైవేటు ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే జిల్లా వైద్య శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయమ్మ డ్రెస్సింగ్ చేయడం విశేషం.

జిల్లా వైద్యాధికారి కార్యాలయం పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఇలా ఉంటే మరి ఇతర ప్రాంతాల్లో ఎలా ఉంటుందో వారి ఊహకే వదిలేయవచ్చు. కానీ తరచూ పర్యవేక్షణ చేయాల్సిన అధికారి ఎందుకు ఉన్నట్లోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పర్ పిహెచ్‌సిలో జనరల్, ఫిజిషియన్, గైనకాలజిస్ట్, డెంటల్ ఇలా ఒక్కొక్కరు చొప్పున వైద్యులతో పాటు 24 గంటల పాటు వైద్య సేవలు కొనసాగేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత వైద్యాధికారులది. కానీ కేవలం డెంటల్ వైద్యురాలు, ఇద్దరు స్టాఫ్ నర్సులను మాత్రమే ఉంచి మిగతా వారిని వారికి అనుకూల ప్రాంతాలకు మార్చడం విశేషం. ఇందుకు కారణాలను తెలపాల్సి ఉంది.

పీహెచ్‌సీల్లో పని దొంగలే ఎక్కువ..! జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 178 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల సమన్వయంతో గ్రామీణులు వైద్యం అందించాల్సి ఉంది. ప్రతినిత్యం ఉదయం 9నుండి సాయంత్రం 4వరకు సంబంధించిన పీహెచ్‌సి వైద్యులు ఒపి ఇతర సేవాలందించాల్సి ఉంది. మిగతా సమయంలో ఫోన్ లైలో అందుబాటులో ఉంటూ వైద్యం అందించాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్న క్రమంలో వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన మిగతా కేంద్రాల వైద్యులు కనీసం డ్యూటీలకు కూడా హాజరు కావడం లేదు.

నెలల తరబడి విధులకు డుమ్మా కొట్టిన బాధ్యత గల అధికారులు కూడా మందలించే పాపాన పోవడం లేదు. దీనికి నిదర్శనంగా నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రజలకు కనీస ప్రాథమిక వైద్యం కూడా అందక అచ్చంపేట, అక్కడి నుండి నాగర్ కర్నూల్ అక్కడి నుండి పాలమూరుకు రెఫర్ చేస్తున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయినా వారికి నెలనెలా జీతాలు మాత్రం సక్రమంగానే పడుతుండం పలు అనుమానాలకు తావిస్తోంది. పర్యవేక్షణ చేసి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందేలా చూడాల్సిన సంబంధించిన అధికారులు కేవలం ప్రచారాలకే పరిమితమయ్యారని గ్రామీణ ప్రజలు మండిపడుతున్నారు.



Next Story