ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించిన గోద్రేజ్!

by Disha Web Desk 17 |
ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించిన గోద్రేజ్!
X

ముంబై: దేశీయ ప్రముఖ కన్స్యూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ కొత్తగా ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం గోద్రేజ్ కేపిటల్ లిమిటెడ్‌ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ సంస్థ గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డింగ్‌కు అనుబంధ సంస్థగా ఉండనుంది. కొత్తగా ఏర్పాటైన గోద్రేజ్ కేపిటల్ లిమిటెడ్(జీసీఎల్) కంపెనీ మూలధనం కోసం రూ. 1,500 కోట్ల పెట్టుబడులను సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ కంపెనీ కార్యకలాపాలు ముందుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణె నగరాల్లో ప్రారంభమవుతాయని, ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై, ఇండోర్, జైపూర్, చండీగఢ్, సూరత్ నగరాలకు విస్తరించనున్నట్టు వివరించింది.

అలాగే, 2026 నాటికి జీసీఎల్ వ్యాపార నిర్వహణకు రూ. 5 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరమవుతాయని కంపెనీ అంచనా వేసింది. 'గోద్రేజ్ కేపిటల్ కంపెనీ మొత్తం గోద్రేజ్ గ్రూప్ వృద్ధికి కీలకంగా ఉండనుంది. తాము కొత్త రంగంలో ప్రవేశించడం పట్ల వినియోగదారుల నుంచి సానుకూల స్పందనను చూశాము. కాబట్టి, మా ఆర్థిక సేవల కొత్త వెంచర్‌పై ఆశాజనకంగా ఉన్నామని, రానున్న రోజుల్లో పరిధిని పెంచగలమని' గోద్రేజ్ కేపిటల్ ఛైర్మన్ పిరోజ్‌షా గోద్రేజ్ అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వినియోగదారులను పెంచుకోవడం, కొత్త వ్యాపార మార్గాలను ప్రారంభించడంతో పాటు రిటైల్ కార్యకలాపాలను కొత్త పట్టణాలకు విస్తరించనున్నట్టు కంపెనీ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. అదేవిధంగా కంపెనీ వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు 2022-23లో దాదాపు 500 మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నామని పిరోద్‌షా వెల్లడించారు.

Next Story

Most Viewed