బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk |
బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్​లో చేరికలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సంబరాలను మరింత రెట్టింపు చేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగాయి. గురువారం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. 1995 ఆగస్టులో ఎర్రశేఖర్ సోదరుడు, జడ్చర్ల టీడీపీ ఎమ్మెల్యే ఎర్రసత్యం హత్యతో 1996లో జరిగి ఉపఎన్నికలో ఎర్రశేఖర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1999లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. ఎర్రశేఖర్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో జడ్చర్ల, 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ ఓటమి చవి చూశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సైతం పార్టీ అప్పగించినా అందులో పొసగకపోయారు. దాంతో బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఎర్ర శేఖర్ చేరికను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి

ఎర్రశేఖర్ చేరికను కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నేరారోపణలు కలిగిన ఎర్ర శేఖర్ ను ఎలా చేర్చుకుంటారని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎర్రశేఖర్ సోదరుడు జగన్ మోహన్ 2013 జులై 18న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎర్ర శేఖర్ ఏ1గా ఉన్నారు. అయితే తర్వాత కాలంలో ఈ కేసులో ఎర్రశేఖర్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే నేరారోపణలు కలిగిన వ్యక్తి పార్టీలో చేరితే అది మొదటికే నష్టం అని కోమటి రెడ్డి వాదిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎర్ర శేఖర్ చేరిక కార్యక్రమానికి కోమటిరెడ్డి దూరంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్టానం వద్ద ఫిర్యాదు సైతం చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి పీసీసీగా ఏడాది సంబరాలు పార్టీలో చేరికల రూపంలో కొంత వరకు జోష్ పెంచినా కోమటిరెడ్డి వ్యతిరేకింస్తున్నారనే వార్తలు పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురి చేస్తున్నాయి.


Next Story