మరో 10-15 శాతం ధరలు పెంచనున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!

by Disha Web Desk 13 |
మరో 10-15 శాతం ధరలు పెంచనున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండున్నరేళ్లలో కరోనా ప్రభావం, ఆ తర్వాత ఈ ఏడాదిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంట్లో వాడే నిత్యావసరాల వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, యుద్ధం వల్ల సరఫరా సమస్యలు తలెత్తడంతో దేశీయ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరోసారి వస్తువులు, సరుకుల ధరలను 10-15 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ వినియోగంలో ముఖ్యమైన గోధుమ, వంటనూనె, ప్యాకేజీ చేసిన వస్తువుల ధరలను 10 శాతం వరకు పెంచాలని ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయని సమాచారం.


ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు పార్లే, డాబర్ కంపెనీలు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన స్థాయిలో ధరలను పెంచాలని చూస్తున్నాయి. మిగిలిన కంపెనీల్లో హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), నెస్లె ఇప్పటికే పలుమార్లు వాటి ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇప్పుడున్న ధరల పై అదనంగా మరో 10-15 శాతం పెంచాలని భావిస్తున్నట్టు పార్లె ఉత్పత్తుల సీనియర్ కేటగిరి విభాగం హెడ్ మయాంక్ షా అన్నారు. ధరలు పెంచడం తప్పని పరిస్థితి అని, అయితే ఎంత మేరకు పెంచనున్నామనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పారు.


అలాగే, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ వరుసగా రెండో ఏడాది అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారులు సైతం ధరల భారాన్ని తగ్గించుకునేందుకు చిన్న ప్యాకేజీలను కొంటున్నారు. కాబట్టి పరిస్థితులను అధిగమించి ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధంగా తమ ఉత్పత్తులపై పెంపు నిర్ణయం తీసుకుంటామని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుష్ జైన్ వెల్లడించారు.



Next Story

Most Viewed