ఏపీకి తలనొప్పిగా మారిన ఐదు గ్రామ పంచాయతీలు..

by Disha Web Desk 2 |
ఏపీకి తలనొప్పిగా మారిన ఐదు గ్రామ పంచాయతీలు..
X

దిశ,ఏపీ బ్యూరో: తెలంగాణలోని భద్రాచలానికి దగ్గరగా ఉన్న5 గ్రామాలు 8 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఏపీలో విలీనమైయ్యాయి. తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కలపాలని గత కొంత కాలంగా అక్కడి ప్రజలు నుంచి ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని కోరుతూ తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం రాజకీయంగా దుమారం రేగింది. ఇరు రాష్ట్రాల మంత్రులు విమర్శ-ప్రతి విమర్శలు చేసుకున్నారు. నెమ్మదిగా మొదలైన ఊళ్ళ పంచాయతీ.. ఇప్పుడు పొలిటికల్ గా పెద్ద ఇష్యు గా మారుతందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమ గ్రామాలను తెలంగాణలో కలపండి..

అయితే ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ మధ్య పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కొద్ది రోజుల క్రితం మాటల యుద్దం సాగింది. పోలవరం నిర్మాణం కారణంగానే తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో వరదలు వచ్చాయని తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేసారు. దీనిపై ఏపీలోని అధికార పార్టీ నేతలు సైతం స్పందించి టీఆర్‌ఎస్ మంత్రులపై విమర్శలు చేశారు. ఇప్పుడు ముంపు మండలాల వ్యవహారం పైన కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంతో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి..ముంపు ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఆ గ్రామాలను ఏపీలో కలపాలని నిర్ణయించింది. ఎనిమిది ఏళ్ల తర్వాత ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద వాటిలో 5 గ్రామాల ప్రజలు ఆందోళన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్​లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకుని పహారా కాస్తున్నారు .కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. సరిహద్దు గ్రామాలు కావటంతో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వరదల సమయంలో తమకు సాయం అందలేదన్నది ఆయా గ్రామాల ప్రజలు వాదన.పైగా జిల్లాల పునర్విభజన లో భాగంగా ఆయా గ్రామాలు క్రొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగం అయ్యాయి.ఎక్కడో మూలన ఉండే ఈ గ్రామాల ప్రజలు తమ జిల్లా కేంద్రం అయిన పాడేరు కు వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అది కూడా వారి ఆగ్రహానికి కారణం అంటున్నారు విశ్లేషకులు.

ఇష్యు లోకి ఎంటరైన చంద్రబాబు:

తాజాగా ఈ వివాదం లోకి టీడీపీ అధినేత,ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు .తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ముంపు గ్రామాల ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో వరుస ట్వీట్లు పెట్టారు. గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకాన్ని చవి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేదని తెలిపారు.కరెంట్ రాకపోవడంతో తాగడానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇళ్లను శుభ్రపరుచుకోవడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారని అన్నారు. బురద, కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించే కనీస ప్రయత్నాలను కూడా ఏపీ ప్రభుత్వం చేయట్లేదని ఆరోపించారు. వారం క్రితమే వరదలు తగ్గాయని చెబుతోన్న మంత్రులు ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్దరించ లేకపోయారో చెప్పాలని నిలదీశారు.

సమస్యలు పరిష్కరించండి : చంద్రబాబు

జగన్ ప్రభుత్వం నుండి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితికి జగన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుందని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.వరదకు చనిపోయిన పశువుల కళేబరాల నుంచి వెలువడే దుర్వాసన, ఇళ్లల్లో వస్తోన్న విష సర్పాలు, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా ఆయా గ్రామాల ప్రజలు రోజులు గడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు గాలిలో పర్యటనలతో కాలక్షేపం చేస్తోన్నారని విమర్శించారు.

తిరిగి తెలంగాణ లో కలపడం సాధ్యమా?

ఏపీ-తెలంగాణా విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ఈ 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టు వాటిని తిరిగి తెలంగాణలో కలపటం సాధ్యమా కాదా అనే చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది ఇప్పటికే ఈ గ్రామాల నుంచి ఇదే డిమాండ్ పైన తీర్మానాలు సైతం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ..పూర్తి చేయటం పైన ఇప్పుడు ఏపీలో రాజకీయంగానూ వివాదం కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా గ్రామాల విలీనం అంశం ఏపీ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇది తాత్కాలికంగా ఆయా గ్రామ ప్రజల ఆవేశం నుండి వచ్చిన ప్రకటనల గానే ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కసారి ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి ఈ అంశం పైనా.. వారు ఎదుర్కొంటున్న సమస్యల పైనా దృష్టి పెడితే అంతా సర్దుకుంటుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మరి ఆ దిశగా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుందా..చూడాలి


Next Story

Most Viewed