శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.. మార్కెట్లలో పెరిగిన సందడి

by Web Desk |
శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.. మార్కెట్లలో పెరిగిన సందడి
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: మహా శివరాత్రికి శివాలయాలు ముస్తాబయ్యాయి. శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ విద్యుత్ దీపాలు, రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పండ్ల ధరలు మరింత ప్రియమయ్యాయి. ఇదిలా ఉండగా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నేడు ఘనంగా పెద్దపట్నం నిర్వహించనున్నారు.

ముస్తాబైన శివాలయాలు

శివరాత్రి వేడుకలకు జిల్లాలో ఉన్న శివాలయాలు ముస్తాబయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోటిలింగాల ఆలయంతో పాటు వర్గల్ స్వయంభూ లింగేశ్వరాలయం, కొండపాక రుద్రేశ్వరాలయం, హుస్నాబాద్ పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం, నంగునూరు మండలం ఖాతా గ్రామంలోని మహాదేవుని ఆలయం, నారాయణరావుపేటలోని బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి వేడుక సందర్భంగా శివాలయాలకు రంగులు వేయించడంతో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో నేడు గణపతి పూజ, దీపారాధన, జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సందడిగా మార్కెట్లు

శివరాత్రి వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలోని మార్కెట్లన్నీ సందడిగా మారాయి. శివరాత్రి పండుగ కోసం పండ్లు, కూరగాయలు, దీపారాధనకు కంచుళ్లు ( దీపాంతలు ) కొనుగోలు చేసేందుకు భక్తులు భారీగా మార్కెటకు చేరుకున్నారు. దీంతో మార్కెట్ పరిసరాలు సందడిగా మారాయి. ఒకేసారి జనం మార్కెట్లకు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది. ఇదిలా ఉండగా శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు హిందు భక్తులు కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో అతి తక్కువ ధరకు పండ్లు విక్రయించారు. దీనికి భక్తుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి పండ్లు కొనుగోలు చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

నేడే మల్లన్న పెద్దపట్నం

శివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పండుగ సందర్భంగా అర్ధరాత్రి వేళ దాదాపు 50 గజాల వైశాల్యంలో 11 వరుసలతో పట్నం ముగ్గు వేస్తారు. పట్నం వేయడం పూర్తయ్యాక స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పెద్దపట్నం వద్ద పూజలు చేస్తారు. అనంతరం శివసత్తులు, జాగరణ చేసే భక్తులు పెద్దపట్నంపై నృత్యం చేస్తారు. ఈ వేడుకకు సిద్దిపేట జిల్లాతో పాటు జనగామ, హైదరాబాద్ జిల్లాల నుంచి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారీకేడ్లు, ఇతర సౌకర్యాలన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.



Next Story

Most Viewed