Telangana News: సరిహద్దుల్లో అలర్ట్.. చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు

by Disha Web Desk 2 |
Telangana News: సరిహద్దుల్లో అలర్ట్.. చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్ ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఆఫీసుల్లోనే ఉండిపోతున్నారు. వడ్ల కొనుగోళ్ళు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో గోనెసంచుల కొరత, మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు సివిల్ సప్లైస్ అధికారులను కలవరపెడుతున్నాయి. కొత్త గోనె సంచుల కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆర్డర్ ఇచ్చే పని జరుగుతుండగానే తక్షణం సరఫరా చేయడానికి ప్రైవేటు కంపెనీల నుంచి కొనడానికి కసరత్తు జరుగుతున్నది. ఒకటి రెండు రోజుల్లో టెండర్ ప్రకటన సిద్ధం కానున్నది.

రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనడంపై ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వేర్వేరు సమావేశాలను ఏర్పాటుచేసి సంబంధిత అధికారులతో చర్చించి తగిన ఆదేశాలను జారీ చేశారు. అందులో ప్రధానమైనది గోనె సంచులను సమకూర్చుకోవడం కాగా, మరొకటి పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం. గోనె సంచుల కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రైవేటు కంపెనీల నుంచి కొనడంపై సమాలోచనలు జరిపారు. వేర్వేరు ప్రైవేటు కంపెనీల నుంచి తక్కువ వ్యవధిలో సమకూర్చుకోడానికి టెండర్లను ఆహ్వానించనున్నారు.

మరోవైపు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వడ్లు తెలంగాణలోకి రాకుండా ఉండేందుకు రవాణా, పోలీసు శాఖలతో కలిపి పౌరసరఫరాల శాఖ చెక్ పోస్టు వ్యవస్థను పటిష్టం చేస్తున్నది. ఆరు జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో 52 చెక్‌పోస్టులను నెలకొల్పుతున్నది. పక్క రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర దొరకనందున తెలంగాణలోకి వచ్చి అమ్ముకునే అవకాశం ఉందని భావించి ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. మూడు శాఖల సంయుక్త సహకారంతో ధాన్యం రవాణాపై నిఘా ముమ్మరం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొంటున్నందున అక్కడి రైతులు ఇక్కడకు వచ్చి అమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉన్నది.

దీన్ని అరికట్టడం కోసం ఒకవైపు చెక్‌పోస్టు వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మరోవైపు రైతుల వివరాలన్నింటినీ వ్యవసాయ శాఖ నుంచి సేకరించి వారి మొబైల్ నెంబర్‌కు ఓటీపీని పంపే డ్యాష్ బోర్డు సిస్టమ్‌ను అమలుచేయనున్నది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని మాత్రమే కొనేలాగ ప్రత్యేక మెకానిజం ఈసారి అమలులోకి వచ్చింది. వారం పది రోజుల వరకూ కొనుగోళ్ళు భారీ స్థాయిలో ఉండకపోవచ్చని సివిల్ సప్లైస్ అధికారులు భావిస్తున్నారు. జూన్ 15వ తేదీ దాకా కొనుగోళ్ళు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోళ్ళు ఈ నెల చివరి వారం నుంచి ముమ్మరం కానున్నట్లు అంచనా వేస్తున్న అధికారులు అప్పటికల్లా గోనె సంచుల కొరత సమస్యను తీర్చుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హఠాత్తుగా ఏర్పాట్లు చేయాల్సి రావడంతో రాత్రి పూట కూడా కొద్దిమంది సిబ్బంది ఆఫీసుల్లోనే గడపాల్సి వస్తున్నది.



Next Story

Most Viewed