గడ్డి అన్నారం మార్కెట్‌ను ఖాళీ చేయండి

by Disha Web Desk |
గడ్డి అన్నారం మార్కెట్‌ను ఖాళీ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం పండ్ల వ్యాపారం జరుగుతున్న గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఖాళీ చేసి తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాటసింగారం మార్కెట్‌కు వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీకల్లా ఖాళీ చేసే ప్రక్రియను ముగించాలని, ప్రభుత్వానికి సహకరించాలని వ్యాపారులను ఆదేశించింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని వివరించింది. గడ్డి అన్నారం మార్కెట్‌ను తరలించడంలో ఉన్న అభ్యంతరాలను, మార్కెట్‌ను ఖాళీచేయడంలో ఉన్న ఇబ్బందులపై హైకోర్టులో వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.

తాత్కాలికంగా బాటసింగారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌లో తగిన సౌకర్యాలు లేవన్న కారణంగా గడ్డి అన్నారం మార్కెట్‌ను ఖాళీ చేయడానికి వ్యాపారులు సిద్ధపడడంలేదు. ఖాళీ చేయడానికి తగిన గడువు ఇవ్వాలని గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల విచారణ సందర్భంగా మార్కెట్‌ను తెరిచి వ్యాపారులు దుకాణాలను ఖాళీ చేయడానికి వెసులుబాటు కల్పించాలని మార్కెటింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. కానీ తెరవకపోవడంతో వ్యాపారులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం తెరిచినా వెంటనే కూల్చివేత పనులను మొదలుపెట్టింది. దీన్ని సవాలుచేస్తూ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేత చర్యలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా వ్యాపారులకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఇచ్చి దుకాణాలను ఖాళీచేసి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించకుండా ప్రభుత్వానికి సహకరించాలని స్పష్టం చేసింది. బాటసింగారం మార్కెట్‌కు వెళ్ళిపోవాలని సూచించింది.



Next Story

Most Viewed