తక్షణమే చార్జీలు పెంచండి.. లేదంటే ఈ నెల 28, 29న రాష్ట్రవ్యాప్త బంద్..!

by Disha Web Desk 19 |
తక్షణమే చార్జీలు పెంచండి.. లేదంటే ఈ నెల 28, 29న రాష్ట్రవ్యాప్త బంద్..!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆటో రంగ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఆటో చార్జీల రేట్లను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్, క్యాబ్స్ యూనియన్స్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జేఏసీ సమావేశం బి వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు బి. వెంకటేశం, ఒమర్ ఖాన్, లతీఫ్ (ఏఐటీయూసీ), ఏ. సత్తి రెడ్డి (టిడిఎస్), జి. మల్లేష్ గౌడ్ (ఐ.ఎన్.టి.యు.సి), వి. మారయ్య, (టి.ఆర్.ఎస్.కె.వి), ఎండి. అమానుల్లాహ్ ఖాన్ (టి.ఏ.డి. జేఏసీ), శ్రీను (ఐ.ఎఫ్.టి.యు ), శ్రీకాంత్ (సిఐటియు), ఆటో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ. సలీం, నాయకులూ రఫాత్ బేగ్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు సలావుద్దీన్, రాజశేఖర్ రెడ్డి, తిరుమలేష్ గౌడ్, నగేష్ సతీష్‌లు మాట్లాడుతూ.. నగరంలో గత 8 సంవత్సరాల నుండి ఆటో చార్జీల రేట్లను పెంచకపోవడం సిగ్గుచేటన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్నోసార్లు వినతి పత్రాలు, నిరసనలు, ధర్నాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు సంవత్సరాల నుండి లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆంక్షలు, భయంతో ప్రజలు ఇండ్లు వదిలి బయటకు రాకపోవడంతో క్యాబ్, ఆటోలకు డిమాండ్ బాగా తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందన్నారు. ఆటోల కొనుగోలుకు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, సీఎన్జీతో కూడిన 20వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా వృద్ధాప్య పింఛను, ఆటోల కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని, ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 10 వేలు ఇవ్వాలని, ఇతర జిల్లాలలోని ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగనీయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తాము కోరుతున్నవి పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28, 29 తేదీలలో ఆటోల బంద్ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed