గజ్వేల్‌ను వీడనున్న సీఎం కేసీఆర్.. ఆ స్థానం నుంచి పోటీకి అవకాశం

by Web Desk |
గజ్వేల్‌ను వీడనున్న సీఎం కేసీఆర్.. ఆ స్థానం నుంచి పోటీకి అవకాశం
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: రాబోయే ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు టీఆర్ఎస్ టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను వీడటం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఎవరు ఏ నియోజకవర్గం నుండి నిలబడాలన్న దానిపై ఇప్పటికే అభ్యర్థులకు సంకేతాలిచ్చారని, దాని ప్రకారమే అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, ఇతరత్ర అంశాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( పీకే )తో ఏకాంతంగా భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీఆర్ఎస్ సిద్దిపేట అభ్యర్థులు వీరే..?

సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్లు ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను వీడనున్నారు. ఆ స్థానంలో ప్రస్తుత ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డిని నిలబెట్టనున్నారు. ఇందుకు సంబంధించి గత నెలలోనే సంకేతాలు అందించారు. ప్రతాప రెడ్డి విజయం కోసం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వెంకట్రామ రెడ్డిలు బాగా పనిచేయాలని సూచించడమే ఇందుకు సంకేతం. కాగా దుబ్బాక సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకునేందుకు సైతం స్థానిక నాయకుడు, ప్రస్తుత మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి కేటాయించినట్టు సమాచారం.

ఇటీవల దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన సమయంలో మీ ఎమ్మెల్యే కేపీఆరే అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా హుస్నాబాద్, సిద్దిపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్లు కేటాయించినట్లు సమాచారం. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒడితల సతీశ్ కుమార్, సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుకు తిరిగి పార్టీ టికెట్ కేటాయించారని వినికిడి. ఎన్నికల సమయం దగ్గర పడ్డాక అప్పటి పరిస్థితులను బట్టి అభ్యర్థులు మారే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల వైపు సీఎం అడుగులు..

ప్రస్తుతం సీఎం దృష్టంతా జాతీయ రాజకీయాల వైపు మళ్ళింది. 2018 లోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన పరిస్థితులు అనుకూలించలేదు. తిరిగి ఈ సారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నాయకులను కలిశారు. వారితో సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. పార్లమెంట్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు తన సొంత జిల్లా మెదక్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. గతంలో కరీంనగర్, మహబూబ్ నగర్ స్థానాల నుండి పార్లమెంట్‌కి వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ సారి తన సొంత పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ మేరకు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( పీకే )ను రంగంలోకి దించారు. కేసీఆర్ కోరిక మేరకు సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పీకే పర్యటించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి. అందరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. సీఎం కేసీఆర్ నుండి ఇంకా మీరు ఎలాంటివి కోరుకుంటున్నారంటూ పలు అంశాలను పలువురిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

అనంతరం కేసీఆర్ ఫాంహౌస్‌లో పీకే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఇదే కేసీఆర్‌కి మంచి సమయమని పీకే చెప్పినట్టు అధికార టీఆర్ఎస్ సీనియర్ నాయకుల నుండి అందుతున్న సమాచారం. ఏదేమైనా కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టడం.. జిల్లాలో పలు మార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story

Most Viewed