27 గంటల సర్జరీ.. కవలల మెదడును వేరు చేసిన డాక్టర్స్!

by Disha Web Desk 7 |
27 గంటల సర్జరీ.. కవలల మెదడును వేరు చేసిన డాక్టర్స్!
X

దిశ, ఫీచర్స్ : అవిభక్త కవలలను సర్జరీ ద్వారా వేరు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అవిభక్త కవలలు వీణా వాణిల తలను వేరు చేసేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదని తెలిసిందే. కానీ బ్రెజిల్‌కు చెందిన కవలలను బ్రిటిష్ న్యూరో సర్జన్ విజయవంతంగా వేరుచేశారు.

మూడేళ్ల వయసున్న కవలలు 'బెర్నార్డో, ఆర్థర్ లిమా'కు ఇప్పటికే ఏడు ఆపరేషన్లు నిర్వహించారు. ఈ క్రమంలోనే లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ 'నూర్ ఉల్ ఒవాసే జిలానీ' ఆధ్వర్యంలో ఇటీవలే చివరి శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సర్జరీ కోసం సీటీ అండ్ ఎంఆర్‌ఐ స్కాన్స్ ఆధారంగా కవలల వర్చువల్ రియాలిటీ(VR) అంచనాలను ఉపయోగించి, నెలల తరబడి ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్స్.. చివరకు విజయం సాధించడంతో దీనిని 'స్పేస్ ఏజ్ స్టఫ్'గా వర్ణించారు.

ఈ శస్త్రచికిత్సకు నిధులు సమకూర్చిన డాక్టర్ నూర్ ఉల్ స్వచ్ఛంద సంస్థ జెమిని అన్‌ట్వైన్డ్.. ఇప్పటివరకు పూర్తి చేసిన అత్యంత సంక్లిష్టమైన విభజన ప్రక్రియల్లో ఈ సర్జరీ ఒకటని పేర్కొంది. ఇక 27 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో నూర్ ఉల్ 15 నిమిషాల చొప్పున నాలుగుసార్లు మాత్రమే బ్రేక్ తీసుకున్నారు. ఈ ఘనతపై మాట్లాడిన ఉల్.. 'ఇది చాలా అద్భుతంగా ఉంది. చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలగకుండా చికిత్స చేయడం నిజంగా గొప్ప విషయమే' అన్నారు.

కవలలుగా పుట్టిన బెర్నార్డో, ఆర్థర్‌ను వేరు చేసినపుడు వారి రక్తపోటు, హర్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. సర్జరీ పూర్తయిన నాలుగు రోజుల తర్వాత వారిద్దరినీ ఒకేచోట చేయి చేయి కలిపితే గానీ రక్తపోటు నార్మల్ స్టేజ్‌కు రాలేదు. కాగా ఇలా తలలు కలుసుకుని ఉన్న కవలలను 'క్రానియోపాగస్' పిల్లలని అంటారు.



Next Story

Most Viewed