అక్రమ నిర్మాణాలపై 'దిశ' ఎఫెక్ట్.. అడ్డగోలు నిర్మాణాలకు చెక్

by Disha Web Desk |
అక్రమ నిర్మాణాలపై దిశ ఎఫెక్ట్.. అడ్డగోలు నిర్మాణాలకు చెక్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అనుమతిలేని నిర్మాణాలపై అధికార యంత్రాంగం కన్నెర్ర చేసింది. ఆగస్టు 2వ తేదీన 'దిశ' దిన పత్రికలో కీసర గ్రామ పంచాయతీ పరిధిలో 'వీధికో అక్రమ నిర్మాణం..!' పేరిట ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆగస్టు 4వ తేదీన సాయంత్రం కీసరలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన 25 అక్రమ కట్టడాలను కూల్చేయాలని జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో మండల పంచాయతీ అధికారి మంగతాయారు, కీసర గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీతల నేతృత్వంలో ఉదయం 7 గంటల నుంచి అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. కీసరలో 25 అక్రమ కట్టడాలను గుర్తించి కార్యదర్శి సునీత బాధ్యులకు వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. అయినా వీరిలో కొందరు అక్రమ నిర్మాణదారులు నోటీసులను లెక్క చేయకుండా నిర్మాణాలు చేస్తుండడంతో శుక్రవారం రెండోసారి వారికి నోటీసులు ఇచ్చేందుకు కార్యదర్శి ఏర్పాట్లు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్పీఓల నుంచి కూల్చి వేయాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఎంపీఓ మంగతాయారు ఆధ్వర్యంలో కీసర మండలంలోని ఇతర కార్యదర్శులను రప్పించి, నాలుగు బృందాలుగా భారీ కూల్చివేతలు చేపట్టారు.

కూల్చోద్దంటూ ఒత్తిడి..

కీసరలో అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభం కాగానే అధికార పార్టీ నేతల నుంచి అధికార యంత్రాంగంపై పెద్ద ఎత్తున ఒత్తిడిలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో సహా ఇతర మండల స్థాయి నాయకులు ఎంపీఓ, కార్యదర్శులకు ఫోన్‌లు చేసి అక్రమ నిర్మాణాల కూల్చి వేతలను తక్షణమే నిలిపివేయాలని, వాటి జోలికి వెళ్లోద్దని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఒక వైపు అధికార పార్టీ నేతల ఒత్తిడితోపాటు అక్రమ నిర్మాణాల నుంచి అమామ్యాలు తీసుకున్న కొందరు బిల్ కలెక్టర్లు కూల్చివేతలకు సహకరించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శి సునీత ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో బిల్ కలెక్టర్లు బడాబాబుల అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. లీడర్లు, బిల్డర్లు నిర్మించిన అక్రమ నిర్మాణాలను పాక్షికంగా ధ్వంసం చేసి, సామాన్య ప్రజలు కట్టిన ఇళ్లను భారీగా ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంకిరెడ్డి పల్లి ప్రధాన రహదారి పక్కన అక్రమంగా నిర్మించిన 10 షాపులను పాక్షికంగా కూల్చడం విమర్శలకు తావిస్తోంది. ఈ కూల్చివేత కార్యక్రమంలో కార్యదర్శులు సుదర్శన్ అమ్రిన్, ఇంద్రజ, శివ, బిల్ కలెక్టర్లు రాంబాబు, బాల నరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలపై చర్యలు తప్పవు

పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే శాఖ పరమైన చర్యలు తప్పవని కీసర గ్రామ పంచాయితీ కార్యదర్శి సునీత హెచ్చరించారు. కీసరలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అలాగే ప్రజా ప్రతినిధులకు డబ్బులు ఇచ్చి అనధికారికంగా నిర్మాణాలు చేపట్టే వారికి అంతకు రెట్టింపు జరిమానాలతో పాటు, అక్రమ నిర్మాణాలు చేస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏలో కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కట్టుకొని, పంచాయతీ, హెచ్ఎండీఏల ద్వారా నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని ఎవరికి మామూలు ఇవ్వకుండా నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. కీసరలో మా దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలు వందల్లో ఉన్నాయని వాటి పై నివేదిక తెప్పించుకొని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story

Most Viewed