స్మార్ట్ సిటీలో డర్టీ కాలనీ

by Dishanational1 |
స్మార్ట్ సిటీలో డర్టీ కాలనీ
X

దిశ, వరంగల్ టౌన్: ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురు చూడడం తప్ప ఆ కాలనీవాసులు పడుతున్న వెతలకు దిక్కు లేకుండా పోతోంది. ఎనుమాముల మార్కెట్ కు అతి సమీపంలో గల బాలాజీ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నట్లుగా ఉంది. పేరుకు మహానగరంలో ఉన్నారన్న మాటే అడవి మధ్యలో ఉన్నట్లుగా ఉందంటూ బాలాజీనగర్ వాసులు ఆవేదన చెందుతున్నారు. తమ బాధలు పట్టించుకునేవారే లేరని మదనపడుతున్నారు.

మహానగరంలో 14వ డివిజన్...

వరంగల్ మహానగరం ఎనుమాముల, దేశాయిపేట దారిలో 14వ డివిజన్ బాలాజీ నగర్ ఉంది. ఈ కాలనీని ఆనుకొని వంద ఫీట్ల రహదారి కూడా నిర్మాణం జరుగుతోంది. కానీ, ఈ కాలనీలో అడుగుపెడితే అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. అంతర్గత రహదారులు లేనే లేవు. మరుగు నీటి కాలువలు లేక వీధుల్లోనే ప్రవహిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ లేక ఇళ్ల మధ్యలో వర్షపు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. మిషన్ భగీరథ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే మున్సిపల్ నీటికి నోచుకుంటున్నామని స్థానికులు పేర్కొనడం గమనార్హం.

ఆరూరి ఇలాఖా...

వరంగల్ మహానగర పాలిక సంస్థ పరిధిలోని కాలనీ అయినా.. ఇది ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నియోజకవర్గంలో భాగం. ఎన్నికల సమయంలో వచ్చిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్కసారి కూడా తమ కాలనీని సందర్శించిన దాఖలాలు లేవని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ సమస్యలను కార్పోరేటర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమిషనర్ కారు దిగితే...

పాలకులు ఎలాగూ తమ కాలనీని పట్టించుకునే పరిస్థితి లేదని, కనీసం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అయినా కారు దిగి తమ కాలనీలో కలియతిరిగితే కాలనీలో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులు కళ్లకు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీలో డర్టీ కాలనీగా మారిన బాలాజీనగర్ కాలనీ బాగుపడుతుందని ఆశిస్తున్నారు.

అధ్వానంగా బ్రతుకుతున్నాం: మహమ్మద్ ఖమర్ అలీ, బాలాజీ నగర్ నివాసి

నగరంలో ఉండి ఇంత అధ్వానంగా బతకవలసి వస్తుందనుకోలేదు. మా కాలనీ బాగోగులు పట్టించుకోవడానికి ఒక్కరు కూడా ఇటు దిక్కున వస్తలేరు. ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించారు నాయకులు. మల్ల నేటికీ కానరాకపోయే.. అప్పుడప్పుడన్నా అధికారులు చూస్తా లేరాయే. రోడ్లు, మరుగు కాలువలు లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపైనే పారుతుంది. ఆ వాసనకు కడుపులో పేగులు బయట పసుతున్నట్లుగా ఉంది. ముక్కులు మూసుకొని తిండి తినవలసి వస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి మేయర్, కమిషనర్ మేడం. జర మా కాలనీలో అడుగు పెట్టండి. మా బాధలు పట్టించుకుని, కాలనీ అభివృద్ధి జరిగేలా చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed