మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగింది

by Disha Web Desk 12 |
మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగింది
X

దిశ, దుబ్బాక : తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో నిర్వాసితులకు తీరని దుఃఖాన్ని మిగుల్చు తున్నారని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన మాయ మాటలు నమ్మడం వల్ల నిర్వాసితుల జీవితాలు ఆగమైనాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు భూ నిర్వాసితులు గురువారం పరిశీలించారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందా లేదా అనే విషయాన్ని నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు.

ముందుగా ఆర్ అండ్ ఆర్ కాలనీ ని సందర్శించి, వారికి జరిగిన లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి ఎంత నష్టపరిహారం అందించారు. ఎలాంటి ప్యాకేజీ ఇచ్చారు. అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులను నిండా ముంచుతుందన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఒక్కో చోట ఒక్కో రకం నష్టపరిహారం అందించి చేతులు దులుపు కుంటుందని ఆరోపించారు. తమ నిజామాబాద్ జిల్లా బోపాల్ మండలం లో గతంలో 1.5 టీఎంసీ తో తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో 3.5 టీఎంసీగా మార్చి తమ బ్రతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.

మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా మారింది అన్నారు. తమ పరిస్థితి అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని వెల్లడించారు. ఇక్కడి నిర్వాసితుల పరిస్థితి చూస్తే ఏ కుటుంబాన్ని పలకరించిన కన్నీరు పెట్టుకుంటున్నారని, మా లాగా మీ పరిస్థితి తెచ్చుకోవద్దని స్వయంగా నిర్వాసితులు తమకు చెప్పుకున్నారని వెల్లడించారు. నిర్వాసితుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు నిజామాబాద్ జిల్లా బొల్లారం మండలం నుంచి బస్సులు కట్టుకొని రావడం జరిగిందని అన్నారు. ఏది ఏమైనా మా గ్రామస్తులం సంతకాలు పెట్టబోమని తేల్చి చెప్పారు.

Next Story

Most Viewed