బీజేపీతో వైసీపీ సహజీవనం చేస్తోంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Vinod kumar |
బీజేపీతో వైసీపీ సహజీవనం చేస్తోంది: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతానన్న పవన్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. బీజేపీ ఒకవైపు వైసీపీతోనూ మరోవైపు జనసేనతోనూ అంటకాగుతుందని ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని సూచించారు. పవన్ ఆశిస్తున్నట్లు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ వైసీపీకి వ్యతిరేకంగా ఉండదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.


ఢిల్లీలో బీజేపీ, వైసీపీలు సహజీవనం చేస్తున్నాయని.. అలాంటప్పుడు పవన్ కల్యాణ్‌కు బీజేపీకి ఎందుకు రోడ్ మ్యాప్ ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీపై వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నోరెత్తకపోవడం దురదృష్టకరమని సీపీఐ నారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వైసీపీ నేతలు భరతనాట్యం చేస్తారని.. అయితే రాష్ట్రానికి వచ్చేసరికి వారంతా శివతాండవం చేస్తారంటూ ధ్వజమెత్తారు.


వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనని పవన్ చెప్పిన సంగతి అటు ఉంచితే.. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని పార్టీలకు సూచించారు. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం చాలా తగ్గిపోయిందని అన్న నారాయణ కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చేవని.. ఇప్పుడు బలం తగ్గడం వల్ల ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story