2017 డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. సీఎస్‌పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్

by Disha Web Desk 12 |
2017 డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. సీఎస్‌పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. తెలంగాణ హైకోర్టు ఆదేశించినా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతున్నదంటూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా ధిక్కరణకు పాల్పడినందున వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో ఈడీ విజ్ఞప్తి చేసింది. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలన్నంటినీ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గత నెల 2వ తేదీన ఆదేశాలు జారీచేసింది. దానికి కొనసాగింపుగా ఎక్సయిజ్ శాఖకు లేఖ రాసిన ఈడీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను, డిజిటల్ రికార్డులను, సాక్షుల, నిందితుల డేటాను ఇవ్వాలని కోరింది.

కానీ ఎక్సయిజ్ శాఖ నుంచి ఈడీ ఆశించిన వివరాలేవీ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు చేయడానికి అవసరమైన వివరాలు ఎక్సయిజ్ శాఖ నుంచి అందనందున జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నది. ప్రధాన కార్యదర్శి, ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్‌పై హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సంబంధించిన వివరాలను ఈడీ తన న్యాయవాది ద్వారా ఇద్దరికీ ఈ నెల రెండో వారం లోనే నోటీసులను కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాన కార్యదర్శిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు వాటికి అదనంగా ఈడీ దాఖలు చేసింది కూడా తోడైంది.

Next Story

Most Viewed