మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం.. వైభవోపేతంగా సాగిన శోభాయాత్ర

by Disha Web Desk 19 |
మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం.. వైభవోపేతంగా సాగిన శోభాయాత్ర
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి ఆలయంలో స్వయంభూల దర్శనభాగ్యానికి సమయం ఆసన్నమైంది. ఉద్ఘాటన క్రతువులో భాగంగా మహాకుంభసంప్రోక్షణ పాంచారత్ర ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వైభవోపేతంగా జరుగుతోంది. ఇందుకు స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన ఈ నెల 21న అంకురార్పణ చేశారు. బాలాలయంలో సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం నిర్వహించారు. స్వామి వారి నిత్య కైంకర్యాల అనంతరం ఉద్ఘాటన సంబంధిత క్రతువులు ప్రారంభమయ్యాయి. అయితే హెలికాఫ్టర్‌లో నేరుగా యాదాద్రి చేరుకున్న ఆయన ఆలయంపై విహంగ వీక్షణం చేశారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర ప్రారంభమైంది.

బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర..

సీఎం కేసీఆర్.. నేరుగా వచ్చి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున శోభాయాత్రలో పాల్గొన్నారు. మంగళవాద్యాలు, మహిళల కోలాటాల నడుమ.. శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అనంతరం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న సీఎం కేసీఆర్​ మొదటగా ఉపాలయాల్లో ప్రతిష్టా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించి తొలి ఆరాధన చేశారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభూల దర్శనాలు ప్రారంభంకానున్నాయి. ప్రథమారాధన, ఆరగింపు, తీర్థ, ప్రసాద గోష్టి ఉంటుంది. ఆ తర్వాత ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాతే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భక్తులకు స్వయంభూల దర్శనానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం ఏడున్నర నుంచి.. శాంతి కళ్యాణం, ఆచార్య, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం, పరిసమాప్తి ఉంటుంది. ఇదిలావుంటే.. ప్రధానాలయంలో దర్శనాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కొండ కింది నుంచి భక్తులను తీసుకొచ్చేందుకు మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్ఘాటనకు యాదాద్రి ఆలయాన్ని.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఉదయం 11.55 గంటలకు మిథున లఘ్న శుభ ముహూర్తంలో ఏక కాలంలో 92 స్థానాల్లో మహా కుంభాభిషేకం జరుగుతోంది. దివ్య విమాన గోపురం సుదర్శన చక్రం వద్ద మహా కుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మనుమడు హిమాన్ష్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ఏకకాలంలో ఏడు గోపురాలపై కుంభాషేకాలు..

ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఏడు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు.. కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు ఘనంగా జరుగుతోంది. శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశం ఉంటుంది.

మహా కుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్, శోభా దంపతులు, కూతురు కవితతో పాటు 15 మంది మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్‌లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.


Next Story