రాష్ట్ర పండుగగా పూలే జయంతి.. ప్రకటించిన సీఎం కేసీఆర్

by Disha Web Desk |
రాష్ట్ర పండుగగా పూలే జయంతి.. ప్రకటించిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సామాజిక దార్శనికుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు పూలే అని ఆయన పేర్కొన్నారు. పూలే జయంతిని హైద‌రాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘ‌నంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. వివక్ష లేని సమానత్వ సమాజం కోసం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త పూలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని సీఎం తెలిపారు. వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన పూలే బాటను అనుసరిస్తూ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్త్రీ విద్య కోసం పాటుబడిన వ్యక్తి ఆయన అని, తన సతీమణి సావిత్రి బాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పి దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం స్థాపించేందుకు ఇది కూడా ఒక కారణమని కేసీఆర్​పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బలహీన వర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి పూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed