ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన.. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు వీరయ్య

by Disha Web Desk 13 |
ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన.. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు వీరయ్య
X

దిశ, నాగర్‌కర్నూల్: రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని ఇప్పుడు కార్మిక వర్గ ఉద్యమాలతో మోడీ తలవంచక తప్పదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు వీరయ్య అన్నారు. మంగళవారం అఖిల భారత సార్వత్రిక సమ్మె రెండో రోజు నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు అమాయకంగా ఉన్నంతకాలం పాలకవర్గాలు మోసం చేస్తూనే ఉంటాయని దీన్ని పసిగట్టి ఐక్య ఉద్యమాలతో కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

దేశ భక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ దేశ సంపదను కొల్లగొట్టడం వ్యతిరేకిస్తూ.. దేశ రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దేశంలో కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయి అనేక మంది రోడ్డున పడితే ఆదాని, అంబానీలు వందల కోట్లకు ఎగబాకారని మండిపడ్డారు. పేదల చేతిలో బ్యాంకులో ఉన్న డబ్బు ఖాళీ అయ్యిందని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రధాని మోడీ కుడి, ఎడమ భుజం పైన ఆదాని, అంబానీలు కరోనా సమయంలో సంవత్సర కాలంలోనే లక్షన్నర కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత శత కోటీశ్వరులు 70 మంది నుంచి 140 మందికి పెరిగారని ఆయన అన్నారు. ఒకవైపు లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటున్న వారిని వదిలి ఐదువేల వేతనం ఇస్తున్న స్కీమ్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల యాప్ పేరుతో ఇబ్బందులు కలిగించడం శోచనీయమన్నారు. స్మార్ట్ ఫోన్ల పేరుతో ఉద్యోగస్తుల నెత్తిన పని భారం మోపడం సరికాదన్నారు. 150 ఏళ్లుగా కార్మికులు ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై పోరాటాలు చేస్తుండడం అభినందించదగ్గ పరిణామమన్నారు. పోరాటాల సమయంలో జైలుపాలు చేయడం కర్రలతో దాడులు చేసినప్పటికీ ఉద్యమాలు వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు.

కనీస వేతనాల చట్టం అమలు చేసే దాకా ఉద్యమాలు ఆపేది లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మనుషులంతా సమానమేనని ఒకవైపు వాదిస్తుంటే మరోవైపు ఆడ, మగ మధ్య ఉద్యోగస్తుల మధ్య తేడాలు పెట్టడం సిగ్గుచేటన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను అమలు చేయాలని ఒక వైపు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ఉన్న చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కుల పై ఉక్కు పాదం మోపే ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావడం దారుణమన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు భవన నిర్మాణ రంగం ఆశాలు అంగన్వాడీలకు ఒకే చట్టం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘ రైతు ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపడం దారుణమన్నారు. హక్కుల కోసం జరిగే ఏ పోరాటమైనా ఐక్య ఉద్యమాలతోనే విజయం సాదించగలమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పర్వతాలు, కార్యదర్శి శ్రీను, గీత, ఆంజనేయులు, వెంకట్ రాములు, బాలయ్య, రామస్వామి, మహేష్, వెంకటేష్, రాజ్ కుమార్, సుమలత, రజిత, బాల్ రెడ్డి, శ్రీనివాసులు, శంకర్ నాయక్, స్వప్న, శివ వర్మ, భార్గవి, ప్రభాకర్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed