'ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే'

by Dishanational2 |
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ విధానాలే పెట్రో, గ్యాస్‌ ధరల పెరుగుదలకు కారణమని, రాష్ట్రంలో విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచటం దుర్మార్గమని, తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీల సమావేశం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 4న జరిగింది. ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన ప్రతిపాదనలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశం ముందుంచారు. బీజేపీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచుకుంటూ పోతుందని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పెరుగుతున్న ధరలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందిపోయి విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, ఈ సమస్యను టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల సమస్యగా చేస్తూ అయోమయానికి గురిచేస్తున్నాయని, ఇది తెలంగాణ రైతుల సమస్యగా పరిగణించి, అన్ని పక్షాలను కలుపుకొని పోవాలని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గత వారం రోజులుగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అడ్డూ అదుపు లేకుండా ప్రతి రోజూ సగటున 60 పైసలు చొప్పున పెంచుతూ పోతున్నారని, పెట్రోల్‌ రూ. 118, డీజిల్‌ రూ. 105కి పెరిగిందన్నారు. ఇంకెంత పెరుగుతుందో అంతులేదని, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడిందన్నారు. అన్ని నిత్యావసరాల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయన్నారు. ఆయిల్‌ ధరల పెరుగుదలకు రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం సాకుగా చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అపసవ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే నడుస్తోందన్నారు. ప్రజల పట్ల బాధ్యత కలిగిన వామపక్షాలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, తక్షణమే ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ఈ నెల 13న సమావేశం నిర్వహించి ఐక్య పోరాట కార్యక్రమాన్ని, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాలని సమావేశం తీర్మానించింది. ఈ లోగా వివిధ పార్టీలు ధరల పెరుగుదలపై స్వతంత్ర కార్యాచరణను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ, టీడీపీ రాష్ట్ర నాయకుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా నాయకులు కె రమ, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఝాన్సీ, చలపతిరావు, యంసీపీఐయూ రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యుడు వనం సుధాకర్‌, ఎస్‌యుసీఐ నాయకుడు భరత్‌, ఆర్‌ఎస్‌పీ నాయకుడు జానకిరాములు హాజరయ్యారు.


Next Story

Most Viewed