కేసీఆర్ పన్నిన ఆ కుట్రను త్వరలోనే బట్టబయలు చేస్తాం: మురళీధర్

by Satheesh |
కేసీఆర్ పన్నిన ఆ కుట్రను త్వరలోనే బట్టబయలు చేస్తాం: మురళీధర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీపై దీర్ఘకాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు వ్యతిరేకంగా బలపడుతున్నదని, దీన్ని గ్రహించడంతోనే ప్రజల దృష్టిని మరల్చడానికి వడ్ల కొనుగోళ్ళ అంశాన్ని ప్రభుత్వం ఒక సమస్యగా మార్చిందని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నదని, ఉద్దేశపూర్వకంగానే జటిలం చేస్తున్నదని బీజేపీ నేత మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అబద్ధాలను టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల నుంచి కొంటున్న తరహాలోనే తెలంగాణలోనూ ముడి బియ్యాన్ని కొనడానికి స్పష్టత ఇచ్చిందని తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ లిఖితపూర్వకంగా చెప్పడంతో పాటు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నదని, ఇప్పుడు దానికి రివర్సుగా ధాన్యాన్నే కొనుగోలు చేయాలనే కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై కొట్లాట పెట్టుకుని రైతుల్లో, ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే వ్యూహానికి పదును పెడుతున్నదని ఆయన ఆరోపించారు. బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తే దాన్ని నమ్మడానికి తెలంగాణ ప్రజలు, ఓటర్లు అమాయకులు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీని తెలంగాణ నుంచి దూరం చేయడం టీఆర్ఎస్ వల్ల కాదన్నారు. కేసీఆర్ పన్నిన వడ్ల కుట్రను త్వరలోనే బట్టబయలు చేస్తామన్నారు. వడ్ల విషయంలో టీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పడితే తాము గల్లీ బాట పట్టి రైతులకు వాస్తవాలను అర్థం చేయిస్తామన్నారు. టీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ మొత్తం ప్రజల దృష్టిని మళ్ళించడం కోసమేనని, వడ్ల కోసం కాదన్నారు. నిజంగా వడ్ల కోసమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించవచ్చు గదా అని ప్రశ్నించారు.

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజంగా వివక్ష ఉన్నట్లయితే దేశంలోనే ఎక్కువ బియ్యం సేకరించిన రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఎలా ఉంటుందని మురళీధర్ రావు ప్రశ్నించారు. ప్రతీ సీజన్‌కు ముందు రాష్ట్రాల్లోని దిగుబడిని అంచనా వేసి ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి వివరాలను కేంద్ర ఆహార శాఖ సేకరిస్తుందని, తెలంగాణ ఇచ్చిన మోతాదుకంటే ఎక్కువగానే కేంద్రం సేకరించిందని గుర్తుచేశారు. కేంద్రమే ప్రతీ సంవత్సరం బియ్యాన్ని కొంటున్నదని, కానీ తానే కొంటున్నట్లు రైతుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రమలు కల్పించారని, ఈ సంవత్సరం వ్యవహారంతో ఆయన బండారం బట్టబయలైందన్నారు. ఏడేళ్ళుగా కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకున్నారని, ఇప్పుడు వాస్తవం రైతులకు అర్థమైపోయిందన్నారు.

ఇప్పటికీ తెలంగాణ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాటలు మార్చే కేసీఆర్ రంగులు మార్చడంలోనూ దిట్ట అని సెటైర్ వేశారు. మిల్లర్లకు లాభం చేకూర్చడానికి వారితో కుదిరిన అవగాహన మేరకు ఈ నాటకం ఆడుతున్నదని ఆరోపించారు. ఇంతకాలం మైనింగ్, కాంట్రాక్టర్లతో బ్రోకర్ పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇప్పుడు మిల్లర్లతోనూ దాన్ని మొదలుపెట్టిందన్నారు. బ్రోకర్లకు లాభం చేయడానికి రైతులకు అన్యాయం చేస్తున్నదన్నారు.

Next Story

Most Viewed