కొత్త కవులకు మార్గదర్శి 'దిక్సూచి': భువనచంద్ర

by Disha Web Desk 19 |
కొత్త కవులకు మార్గదర్శి దిక్సూచి: భువనచంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: "ఒక కవి ఓ గ్రంథాన్ని వెలువరించడమంటే తల్లి ప్రసవ వేదనలాంటిదేనని" ప్రసిద్ధ సినీ గేయ రచయిత భువనచంద్ర అన్నారు. ఉదయసాహితి హుస్నాబాద్ ఆధ్వర్యంలో శ్రీదాస్యం లక్ష్మయ్య సభాధ్యక్షతన ఆదివారం జూమ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి భువనచంద్ర ముఖ్య అతిథిగా హాజరై.. ప్రముఖ కవి, రచయిత విమర్శకులు దాస్యం సేనాధిపతి రచించిన "దిక్సూచి" వచన కవిత కరదీపికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు ఈ గ్రంథం మార్గదర్శకంగా నిలుస్తుందని" పేర్కొన్నారు. విశిష్ట అతిథి, కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి జి.వి.శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. "దిక్సూచి ప్రతి గ్రంథాలయంలో ఉండవలసిన గ్రంథమని" అన్నారు. "దిక్సూచి కవిత్వం ఎలా ఉండాలో తెలిపే సంక్షిప్త గ్రంథమని" శాతవాహన యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కడారు వీరారెడ్డి తెలిపారు. మరోవిశిష్ట అతిథి, ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ "మానవ జీవనయానంలో కవిత్వం ఒక ఇంధనమని.. దిక్సూచి కొత్త తరానికి దిశా నిర్దేశం చేస్తుందని" అన్నారు. గ్రంథాన్ని ప్రముఖ కవయిత్రి ముద్దు వెంకటలక్ష్మి పరిచయం చేసారు. ఈ కార్యక్రమంలో సాహితీ గౌతమి కార్యదర్శి గాజుల రవీందర్, ఉదయసాహితి అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్, పత్తిపాటి రూపలత, సావిత్రి రంజోల్కర్, రాయవరపు సూర్యప్రకాశరావు, ఎర్రం రాజారెడ్డి తదితర కవులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed