అవినీతి ఆరోపణలతో అష్నీర్ గ్రోవర్ భార్యను తొలగించిన భారత్‌పే!

by Web Desk |
అవినీతి ఆరోపణలతో అష్నీర్ గ్రోవర్ భార్యను తొలగించిన భారత్‌పే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే సహ-వ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ గత కొంతకాలంగా సంస్థకు సంబంధించిన వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంస్థ ఆయన భార్య మాధురీ జైన్‌ను అవినీతి ఆరోపణల కారణంతో తొలగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అష్నీర్ గ్రోవర్‌ను సెలవులకు పంపించిన కంపెనీ, అంతర్గత విచారణ జరిపి పూర్తిస్థాయిలో సంస్థ నుంచి తొలగించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ క్రమంలోనే మాధురీ జైన్‌ను తొలగించే చర్య తీసుకున్నట్టు సమాచారం. సంస్థ కంట్రోలర్ హోదాలో ఉండి ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారించామని, ఈ కారణం తో కంపెనీలో ఆమెకు ఉన్నటువంటి వాటాను రద్దు చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. సంస్థకు చెందిన నగదును ఉపయోగించి మాధురి జైన్ తనకు అవసరమైన వ్యక్తిగత షాపింగ్ చేయడం, విదేశాలకు ట్రిప్‌లు వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. తప్పుడు ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి ఆమె సంస్థను మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది.

దీనిపై స్పందించిన మాధురీ గ్రోవర్ ట్విటర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. తనపై లేనిపోని ఆరోపణలు, మోసకారి అనే లేబుల్ కంపెనీ వేస్తోందని చెప్పారు. కాగా, అష్నీర్ గ్రోవర్ ఇప్పటికే సంస్థ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తాము సంస్థ నుంచి వెళ్లాలంటే రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని, లేదంటే తన ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగాలని ఇన్వెస్టర్లకు తేల్చి చెప్పారు.



Next Story

Most Viewed