ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో మరోసారి సెమీకండక్టర్ల కష్టాలు!

by Disha Web Desk 17 |
semiconductor
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్స్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు సంకేతాలు కనిపించాయి. కంపెనీలు, పలు పరిశోధనా సంస్థలు సైతం మరో రెండు మూడు నెలల్లో సెమీకండక్టర్ కొరత నుంచి బయటపడగలమని పేర్కొన్నాయి. అయితే, గత వారం రోజులుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి సెమీకండక్టర్స్ కొరత సమస్య మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆటోమొబైల్ రంగం అత్యంత ప్రతికూలంగా సరఫరా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) పేర్కొంది. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల తయారీకి ఇబ్బందులు తప్పవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు నియాన్, పల్లాడియం ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా దేశాలే ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే పల్లాడియంలో 44 శాతం రష్యా నుంచే జరుగుతుంది. ఉక్రెయిన్ నుంచి 70 శాతం వరకు నియాన్ ఎగుమతి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుండటంతో వీటి ఎగుమతుల్లో తీవ్ర అంతరాయం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. 2020లో కరోనా తర్వాత సెమీకండక్టర్ల కొరతతో మొత్తం టెక్నాలజీ పరిశ్రమలు కష్టాల్లో పడ్డాయి. మరోసారి యుద్ధ పరిస్థితుల వల్ల మరింత కాలం ఈ కష్టాలు కొనసాగుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల సెమీకండక్టర్ల కొరత మరింత పెరిగి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు వెల్లడించారు.


Next Story

Most Viewed