ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

by Disha Web Desk 13 |
ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
X

న్యూఢిల్లీ: ఐపీఎల్-2022 సీజన్ ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహాయ కోచ్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ నియమితుడయ్యాడు. దీనికి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంగళవారం ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ జట్టుకు ఆసిస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.


ఆయనతో పాటు ప్రవీణ్‌ అమ్రే, అజిత్‌ అగార్కర్‌ అసిస్టెంట్‌ కోచ్‌లు వ్యవహరిస్తుండగా, జేమ్స్‌ హోప్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీకి అసిస్టెంట్ కోచ్‌గా నియామకం కావడం పట్ల షేన్ వాట్సన్ ఈ విధంగా స్పందించాడు.

'ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా తనను నియమించడం చాలా సంతోషంగా ఉంది. దిగ్గజ క్రికెటర్‌, కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సాధించిన రికీ పాంటింగ్ నేతృత్వంలో పని చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. గతంలో నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) జట్లకు సేవలందించాను. ప్రస్తుతం కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను'. అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.


కాగా, ఐపీఎల్‌లో షేన్‌ వాట్సన్‌ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా పేరొందాడు. వాట్సన్ గతంలో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున కీలక ప్లేయర్‌గా రాణించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి‌వరకు 145 మ్యాచులు ఆడిన వాట్సన్‌ మొత్తంగా 3,874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 అర్థ సెంచరీలు ఉండగా.. బౌలింగ్‌ 92 వికెట్లు పడగొట్టాడు.

Next Story

Most Viewed