భారత్‌పే ఎండీ, బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన అష్నీర్ గ్రోవర్!

by Web Desk |
భారత్‌పే ఎండీ, బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన అష్నీర్ గ్రోవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం భారత్‌పే, దాని సహ-వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేస్తూ అష్నీర్ గ్రోవర్ నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో ప్రతీ విషయం తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా భారత్‌పేలో సంస్థ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌లపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపైనే ఇటీవల మాధురీ జైన్‌ను సంస్థ నుంచి తప్పించారు. కంపెనీకి చెందిన డబ్బును ఆమె వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారని ప్రైవేట్ ఏజెన్సీ చేసిన దర్యాప్తులో తేలింది. ఈ కారణంతో ఆమెను కీలక బాధ్యతల నుంచి తొలగించడమే కాకుండా ఆమె వాటాను కంపెనీ రద్దు చేసింది. ఈ వ్యవహారం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే అష్నీర్ గ్రోవర్ కూడా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 'నా ఆధ్వర్యంలో స్థాపించిన సంస్థ నుంచి బయటకు వెళ్లడం బాధాకరంగా ఉంది. ఫిన్‌టెక్ రంగంలో భారత్‌పే సంస్థ అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నారు. కానీ ఇటీవల పరిణామాలు నన్ను బాధిస్తున్నాయి. మాధురి జైన్‌ను తొలగించడం, తమపై ఆరోపణలకు బయటి ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని' అష్నీర్ గ్రోవర్ రాజీనామా లేఖలో వివరించారు. ఇక, అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేస్తున్నట్టు లేఖ ఇచ్చిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ప్రకటించింది. అష్నీర్ గ్రోవర్ ప్రవర్తనకు సంబంధించి పీడబ్ల్యూసీ నివేదిక, దాని ఆధారంగా రాబోయే బోర్డు సమావేశంలో తీసుకునే చర్యల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన తన పదవులకు రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.



Next Story

Most Viewed