YSR ఫ్యామిలీ నుంచి మరో కొత్త పార్టీ.. ఆ నినాదంతో ప్రజల్లోకి!

by Disha Web Desk 2 |
YSR ఫ్యామిలీ నుంచి మరో కొత్త పార్టీ.. ఆ నినాదంతో ప్రజల్లోకి!
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడుపోసుకోబోతుందా? వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మరొక కొత్త పార్టీ ఆవిర్భవించనుందా? ఇప్పటికే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ఏర్పాటయ్యాయి. ఒకటి వైఎస్ఆర్ తనయుడు జగన్ ది, మరొకటి వైఎస్ఆర్టీపీ అనేది తనయ వైఎస్ షర్మిలది. తాజాగా అల్లుడు బ్రదర్ అనిల్ కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారని సమాచారం. కొత్త పార్టీ పెట్టడమే కాదు సరికొత్త నినాదంతో బ్రదర్ అనిల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తానంటూ బ్రదర్ అనిల్ పరోక్ష సంకేతాలిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫలానా కులానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించడం ఇదే మెుదటిసారి కావొచ్చు. ఇదిలా ఉంటే బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ, జేఏసీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి వేలు పెట్టొద్దని హెచ్చరిస్తున్నాయి. బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ఏర్పాటునకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఇలా క్రిస్టియన్ జేఏసీ నుంచి వార్నింగ్ రావడం చర్చనీయాంశంగా మారింది.

వరుస భేటీలతో బిజీబిజీ

రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా బ్రదర్ అనిల్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బావ బ్రదర్ అనిల్ కుమార్ వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో మూడు సార్లు దర్శనమివ్వడం అందులో భాగమేనని సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలతో బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని వారు సూచించారు. రాజకీయ ఉద్దండడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌నీ కలవడం తెలిసిందే. ఈ వరుస సమావేశాల్లో ఒక్కోసారి ఒక్కో అంశంపై బ్రదర్ అనిల్ స్పందిస్తున్నారు. విజయవాడలో జరిగిన భేటీలో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వార్తలను ఖండించారు. మరి ఆయనే విశాఖపట్నంలో జరిగిన భేటీలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. విశాఖ నగరంలో మిషనరీ సంస్థలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, వివిధ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ ఇటీవలే భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పెట్టమని అన్ని సంఘాల వాళ్లూ కోరుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బీసీలకు సీఎం పదవి?

ఇక వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడం లేదని బ్రదర్ అనిల్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు పార్టీ కోసం కృషి చేసిన సంఘాలు, ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ రెండేళ్లుగా వారికి దొరకపోవడం విచారకరమని ఓ సందర్భంలో తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ వస్తుందని నెరవేరుస్తానని అనిల్ ప్రకటించిన విషయం విదితమే.

ఢిల్లీ వేదికగా కొత్త పార్టీ ప్రకటన

బ్రదర్ అనిల్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పరోక్షంగా బ్రదర్ అనిల్ సహకరించారు. క్రైస్తవ మతపెద్దలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో భేటీ, ఆపై ఓట్లను వైసీపీకి పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఫాలోయింగ్ ఉండటం వివిధ సంఘాలు పార్టీ పెట్టాలని ఒత్తిడి చేస్తుండటంతో పార్టీ పెట్టుకోవాలనే యోచనలో బ్రదర్ అనిల్ ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ లో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని సమాచారం. ఢిల్లీ వేదికగా ఈ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.

పొలి'ట్రిక్స్'..

బ్రదర్ అనిల్ కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంటున్నారు. పైగా బీసీ అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉండటం ఇవన్నీ జగన్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకవైపు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు, ప్రతిపక్షాల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్‌కు సొంత బావ పక్కలో బల్లెంలా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలాఉంటే అనిల్ కొత్త పార్టీ ఏర్పాటు జగన్ వ్యూహంలో భాగమేనంటూ ప్రచారం జరుగుతున్నది. వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలకు కలిసిరాకుండా ఉండేందుకు జగన్ తెరవెనుక వ్యూహం రచిస్తున్నారని కూడా వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల జోలికొస్తే సహించబోం: బ్రదర్ అనిల్‌కు ఏపీ క్రిస్టియన్ జేఏసీ వార్నింగ్

బ్రదర్ అనిల్‌కు ఏపీ క్రిస్టియన్ జేఏసీ షాక్ ఇచ్చింది. బ్రదర్ అనిల్ రాష్ట్రంలో అడుగుపెట్టొద్దని హెచ్చరించింది. తిరుపతిలో ఏపీ క్రిస్టియన్ జేఏసీ భేటీ అయ్యింది. అనంతరం క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ రాజకీయ అవతారం ఎత్తడంపై మండిపడ్డారు. అగ్రకులానికి చెందిన బ్రదర్ అనిల్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అనిల్ తెలంగాణ రాజ‌కీయాలకు ప‌రిమిత కావాల‌ని హిత‌వు ప‌లికారు. రెండు నెల‌ల క్రితం రాజ‌కీయాల‌తో సంబంధంలేద‌న్న బ్రద‌ర్ అనిల్, ఇప్పుడు దేవుడి ఆదేశిస్తే వ‌స్తాన‌ని చెప్పడం సరికాదంటున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల నెలకొల్పిన వైఎస్ఆర్టీపీ పనులు చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Next Story

Most Viewed