Konaseema జిల్లాకు పేరు మార్పు.. కేబినెట్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
Andhra Pradesh Cabinet Changes Name of Konaseema District to Dr.BR Ambedkar Konaseema
X

దిశ, ఏపీ బ్యూరో: Andhra Pradesh Cabinet Changes Name of Konaseema District to Dr.BR Ambedkar Konaseema| రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా పేరుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెడుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లా పేరుపై చర్చ జరిగింది. వీటితో పాటు 41 అంశాలపై కేబినెట్ చర్చించింది. అయితే ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టే అంశంపై కలెక్టర్ ఇచ్చిన నివేదికపై చర్చించింది. చర్చల అనంతరం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇకపై కోనసీమ జిల్లా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పిలవబడనుంది.


మరోవైపు ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు సైతం రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర తెలిపింది. ఇకపోతే కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ సాధనసమితి మే 24న పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులకు నిప్పుపెట్టారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. వీటితో పాటు మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌లకు చెందిన ఇళ్లకు నిప్పంటించిన సంగతి తెలిసిందే. దీంతో కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ 144 సెక్షన్ అమలులో ఉంది. సుమారు రెండు వారాలపాటు ఇంటర్నెట్ సర్వీసులు సైతం నిలిపివేసిన సంగతి విదితమే. తాజాగా కేబినెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed