రైతు భూమిని లాక్కుంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్

by Disha Web Desk 13 |
రైతు భూమిని లాక్కుంటున్న కాంగ్రెస్ కౌన్సిలర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తన వ్యవసాయ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తూంకుంట కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బాధిత రైతు గుడిసెల వెంకటయ్య ముదిరాజ్ ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో వెంకటయ్య తన భార్య చంద్రమ్మ, కుమారుడు మల్లేష్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఈ భూమి తనదంటూ మధుసూదన్ రెడ్డి ముఠా.. పొలంను కబ్జా చేసేందుకు తనతో సహా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి మండలం, క్యాసారం(కేశవరం) గ్రామానికి చెందిన రైతు గుడిసెల వెంకటయ్య సర్వేనెంబర్ 279, 280 ,287 లలో నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమిని 1984లో కొనుగోలు చేసి.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. అయితే ఇటీవల తూముకుంట మున్సిపల్ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి కొంత మంది గుండాలతో వచ్చి భూమి తనదంటూ వ్యవసాయ పొలంలో ఉన్న తమను భయ బ్రాంతులకు గురి చేస్తూ, తన భార్య చంద్రమ్మపై, కుమారుడు మల్లేష్ లను దుర్భాషలాడుతూ గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదే విషయమై పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ అయినందున రాజకీయ పలుకుబడి వల్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా తిరిగి పేద రైతులమైనా తమపైనే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు.

ఈ భూమి పై గౌరవ సీనియర్ సివిల్ జడ్జి, రంగారెడ్డి, మేడ్చల్ లో ఐఏ నెంబర్.1899/2019 ఇన్ ఓఎస్ నం.400/2019 ద్వారా ఇంటరిం ఇంజక్షన్ ఆర్డర్ కూడా మాకు ఉందని అన్నారు. అసలు విషయానికి వస్తే కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి సర్వే నెంబర్ 7 లో 2018 లో భూమిని కొనుగోలు చేశారని, అట్టి భూమిని పోయిన సంవత్సరం 16 జనవరి 2021 వ తేదీన రిజిస్టర్ డాక్ మెంట్ నం.30 ఆఫ్ 2021 మూడు చింతలపల్లి మండల తహశీల్దార్ & జాయింట్ రిజిస్ట్రార్ ద్వారా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రేణుకాదేవికి అమ్మడం కూడా జరిగిందన్నారు.

తన భూమిని అమ్మిన తర్వాత మధుసూదన్ రెడ్డి ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన భూమి పై కన్నేశాడని వాపోయాడు. ఎవరైనా సరే వారికి ఎక్కడ, ఏ సర్వే నంబర్ లో భూమి ఉంటే అక్కడే పొజిషన్ తీసుకోవాలని, కానీ ఎంత చెప్పినా మధుసూదన్ రెడ్డి వినకుండా తమ పొలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో, ఆయనకు భూమిపై ఎటువంటి హక్కులు, ఆధారాలు లేకున్నా ఇక్కడ తన సర్వే నెంబర్ వస్తుందని దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించాడు.


ఇప్పటికే రెవెన్యూ కార్యాలయంలో సర్వే కోసం మీ సేవ ద్వారా అప్లికేషన్ కు దరఖాస్తు కూడా చేయడం జరిగిందన్నారు. అయినా కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి ఒత్తిడి మేరకు రెవెన్యూ సర్వేయర్.. సర్వే కు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సర్వే అనంతరం హద్దులు నిర్ణయించిన తర్వాత ఎక్కడ భూమి వస్తే అక్కడ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు పేర్కొన్నారు. సర్వే చేసే వరకు మా భూములపై మధుసూదన్ రెడ్డి, అతని అనుచరులు రాకుండా అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే సర్వే చేయకుండా అక్రమార్కులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించే వారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర డీజీపీ కి, మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవినీతికి, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వెంకటయ్య మీడియా ద్వారా అధికారులను కోరారు.



Next Story

Most Viewed