శ్రీలంక అధ్యక్ష భవనంలో 40 కళాఖండాలు మాయం

by Disha Web Desk 2 |
శ్రీలంక అధ్యక్ష భవనంలో 40 కళాఖండాలు మాయం
X

కొలంబో: శ్రీలంక అధ్యక్ష భవనంలో దొంగిలించిన కళాఖండాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో బంగారం పూతతో తయారు చేసిన 40 కళాఖండాలను అమ్ముతున్న క్రమంలో పోలీసులు ముగ్గురు దొంగలను అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పెయింటింగ్స్‌లను పురావస్తు శాఖకు తరలించారు. కాగా, ఇటీవల శ్రీలంక దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా చేయాలని జులై 9వ తేదీన నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సాతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాల్లోకి దూసుకెళ్లారు. కొద్ది రోజులపాటు అక్కడే ఉండి జల్సాలు చేశారు. అలాగే స్థానికంగా ఉన్న వస్తువులు, సామగ్రిలను ధ్వంసం చేయడం.. నిప్పంటించడం వంటి పనులు చేశారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనంలో ఉన్న 1000కిపైగా కళాఖండాలను కొందరు దొంగలు దొంగిలించారు. ఈ వ్యవహారంపై శ్రీలంక ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సోమవారం నిరసనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు బంగారం పూతతో తయారు చేసిన 40 కళాఖండాలను అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు దొంగలు రాజగిరియలోని ఓబేశేఖరపురకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరు డ్రగ్స్‌కు బానిసలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు కొలంబో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి కేసును అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై గతంలో శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే స్పందించారు. ప్రభుత్వ అధికార భవనాలు, పార్లమెంట్‌ను ముట్టడి చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు సాయుధ బలగాలు, పోలీసులకు అన్ని అధికారాలు ఇచ్చామన్నారు.


Next Story

Most Viewed