దొంగిలించిన వాహనాల్లో స్మగ్లింగ్.. సడెన్‌గా పోలీసులు ఆపడంతో..

by Dishanational1 |
దొంగిలించిన వాహనాల్లో స్మగ్లింగ్.. సడెన్‌గా పోలీసులు ఆపడంతో..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సొంత వాహనాలపై స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతే రూ. లక్షల్లో డబ్బులు వేస్ట్ అవుతున్నాయని భావించిన స్మగ్లింగ్ ముఠా వాహనాలను దొంగిలించి, అనంతరం నెంబర్ ప్లేట్లను మార్చి.. అందులో అక్రమంగా కలప రవాణా చేస్తున్నారు. దొంగిలించిన వాహనాలు తుక్కుగా మారేదాకా వాడి అమ్మేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గురువారం ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా వివరాలను పోలీస్ కమిషనర్ కె. ఆర్. నాగరాజు విలేకరులతో వెల్లడించారు. "ముంబై కుర్లకు చెందిన అజ్రత్ అలీఖాన్ పాత నేరస్థుడు. 13 కేసులలో మహారాష్ట్ర జైలు శిక్ష అనుభవించాడు. అతడికి నిజామాబాద్ నగరంలోని హైమద్ పుర కాలనీకి చెందిన కలప వ్యాపారి షేక్ సమద్ ఖాన్ జత కలిశాడు. ఇద్దరు కలిసి కలప స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ స్మగ్లింగ్ కోసం బొలెరో వాహనాలను దొంగతం చేసి వాడుకునేవారు. వీరిద్దరు కలసి అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, నేరెడిగొండ, ఇచ్చోడ, ఉత్నూర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్, జగిత్యాల్ ప్రాంతాలలో బొలెరో వాహనాలను దొంగతనం చేశారు. వాటిని కలప అక్రమ రవాణాకు ఉపయోగించి అనంతరం స్క్రాప్ కింద సంబంధిత వాహనాలను హైద్రాబాద్ లో ఈడీ బజార్, భవానీ నగర్ కు చెందిన ఎండీ అబ్దుల్ లతీఫ్ అలియాస్ లడ్డు, అలియాస్ పాషాకు అమ్ముతారు. అజ్రత్ అలీ ఖాన్, షేక్ సమద్ ఖాన్ ఈ నెల 2న ఖానాపూర్ చౌరస్తా వద్ద పార్క్ చేసిన లారీని ఎత్తుకుపోయారు. గురువారు విశ్వనీయ సమాచారం మేరకు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ జగడం నరేష్, రూరల్ ఎస్ఐ లింబాద్రి.. సిబ్బందితో కలసి రైల్వే బ్రిడ్జి బైపాస్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలపై అనుమానం వచ్చి ఆపారు. వాహనాల తనిఖీలో అజ్రత్ అలీ ఖాన్ లారీని నడుపుతుండగా దానిని కవరింగ్ చేస్తూ షేక్ సమద్ ఖాన్ కార్ ను నడుపుతున్నాడు. ఆ వాహనాల పేపర్లు అడుగగా వారు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో వారిని పోలీసులు తమ దైన శైలీలో విచారించారు. కలప స్మగ్లింగ్ కోసం ఆ వాహనాల చోరీ‌ చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో 8 వాహనాల దొంగతనం కేసులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. స్క్రాప్ లో చోరి వాహనాలను కొనుగోలు చేస్తున్న ఎండీ అబ్దుల్ లతీఫ్ పరారీలో ఉన్నాడు" అని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు(డీసీపీ లా & ఆర్డర్) వినీత్, అదనపు డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ నరేష్, రూరల్ ఎస్ఐ లింబాద్రి, సీసీఎస్ ఎస్ఐ సురేష్ తోపాటు సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed