రాజగోపాల్ రెడ్డికి బిగ్ టాస్క్.. ఈసారి అంతకుమించి కష్టపడాలా?

by Disha Web Desk 2 |
రాజగోపాల్ రెడ్డికి బిగ్ టాస్క్.. ఈసారి అంతకుమించి కష్టపడాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. గత గురువారం రాత్రి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలో రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ టికెట్‌ను కేటాయిస్తూ హైకమాండ్ లిస్ట్‌లో పేర్కొంది. దీంతో నియోజకవర్గంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఇంతకాలం టికెట్ తనకే వస్తుందని భావించిన నియోజకవర్గ కీలక నేత చలమల కృష్ణారెడ్డి అసంతృప్తితో రగులుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఘోర పరాజయం పొందిన మహిళా నేత పాల్వాయి స్రవంతి కూడా అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే చలమల కృష్ణారెడ్డి తాను తప్పకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఒక వేళ ఆయన పార్టీ మారితే కొంత కాంగ్రెస్ కేడర్ కూడా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఈసారి ఉప ఎన్నికల్లో కష్టపడిన దానికంటే కోమటిరెడ్డి మరో రెండింతలు ఎక్కువే శ్రమించాల్సి ఉంటుంది. అయితే, 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి 12 వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ అంతర్గత గొడవల మూలంగా కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలు సృష్టించారు. ఈ బైపోల్‌‌లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.

ఈ బై పోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు 97,006 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. అయితే, 2018లో 12 వేలతో 6 శాతం ఓట్లు కలిగివున్న బీజేపీని ఏకంగా 38 శాతానికి పెంచి రెండో స్థానంలో పెట్టారు. తిరిగి మళ్లీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఈ ఓటు బ్యాంక్ మొత్తం మళ్లీ ఆయన వెంటనే ఉంటుందా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. ఆయనకున్న ఈ బలంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తే గెలుపు సునాయాసం కానుంది. ఇంత తక్కువ సమయంలో ఆయన ఓటర్లను ఎలా మచ్చిక చేసుకుంటారో చూడాలి. మొత్తానికి ఈసారి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో గెలవడం బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed