చంద్రబాబు కోసం బీఆర్ఎస్‌ నేత సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ రియాక్షన్ ఏంటి?

by GSrikanth |
చంద్రబాబు కోసం బీఆర్ఎస్‌ నేత సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ రియాక్షన్ ఏంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ కాక రేపుతోంది. బాబు అరెస్ట్‌పై తెలంగాణ రాజకీయాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత అరెస్ట్ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ వైఖరి ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే కేసీఆర్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సెటిలర్ ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఇలా కారణాలు ఏవైనప్పటికీ బాబు అరెస్ట్‌పై కేసీఆర్ మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా కేసీఆర్‌నే ఫాలో అవుతారని అంతా భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేతలంతా చంద్రబాబు అరెస్ట్‌పై పెదవి విరవడం గులాబీ బాస్‌కు అంతుచిక్కని వ్యవహారంగా మారింది. అధినేత ఆజ్ఞ లేనిదే బీఆర్ఎస్‌లో ఎంత పెద్ద లీడరైనా పెదవి విప్పరనే టాక్ ఉన్న క్రమంలో బాబు విషయంలో కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు మాత్రం క్రమంగా చంద్రబాబు అరెస్ట్‌పై రియాక్ట్ అవుతుండటం ఆసక్తిగా మారుతోంది.

ధర్నాకు సిద్ధమైన మాజీ మంత్రి:

సీమాంధ్ర ఓటర్లు, టీడీపీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న సెగ్మెంట్లకు సంబంధించిన నేతలు పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌లో మాత్రం తొలుత ఈ విషయంపై రియాక్ట్ కావడానికి సంకోచించినా ప్రస్తుతం నేతలంతా ముందడుగు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు సహచరులుగా ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారంతా బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, గులాబీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆయన ప్రజాస్వామిక వాదులంతా బాబు అరెస్టును ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగని మోత్కుపల్లి బాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.

నిన్నా మొన్నటి వరకు బాబుకు మద్దతు మాత్రమే ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు క్రమంగా నిరసనల బాట పట్టడంతో బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందో అంతుచిక్కని వ్యవహారంగా మారింది. కాగా, మోత్కుపల్లి ఆలేరు టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ ఆయనకు మొండిచేయి చూపించారు. దాంతో కేసీఆర్‌పై అసంతృప్తితోనే మోత్కుపల్లి ఈ నిరసన వాదన ఎత్తుకున్నారా లేక గతంలో చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నిరసన దీక్ష చేపట్టోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. ఇక చంద్రబాబుకు మద్దతుగా ఇటీవల ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీలో ఆందోళనలు చేస్తే పోలీసుల చేత అరెస్ట్ చేశారు. మరి మోత్కపల్లి దీక్షకు పర్మిషన్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Read More : Chandrababu Case: తెలంగాణ స్పీకర్ పోచారంపై మంత్రి బొత్స మండిపాటు

Next Story

Most Viewed