టీ.కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం.. వర్గాలతో అతలాకుతలం చేస్తున్న సీనియర్లు

by Disha Web Desk 2 |
టీ.కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం.. వర్గాలతో అతలాకుతలం చేస్తున్న సీనియర్లు
X

రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాల్సింది పోయి.. ఎవరికి వారే యమునాతీరేలా ప్రవర్తించడం విస్తుగొలుపుతుంది. జిల్లాలో సీనియర్లమని చెప్పుకునే నాయకుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరికతో జోష్ రాగా.. అది కాపాడుకోవడంలో శ్రేణులు విఫలమవుతున్నారనే వాదన తెరపైకి వస్తుంది. తాజాగా మంగళవారం ఖమ్మం డీసీసీలో ఎన్నికల పరిశీలకుడు, మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరిఫ్ నజీంఖాన్ ఎదుట జరిగిన గలాటా నాయకుల పనితీరును ప్రశ్నిస్తుంది.

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో వర్గవిభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుతున్నాయి. పైకి అందరూ సమిష్టిగా పనిచేస్తున్నామని సంకేతాలు పంపుతున్నా.. లోలోపల అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సీనియర్లమని చెప్పుకునే నాయకుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. పార్టీ పటిష్టత కోసం పనిచేయకుండా వ్యక్తిగత మైలేజీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రేణుల్లో జోష్ పెరగడమే కాకుండా.. పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులనేకమంది ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్ సాధించేందుకు ఎవరికున్న లాబీయింగ్ ను వారు సంప్రదిస్తూ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీ పుంజుకుంటున్న క్రమంలో సీనియర్లుగా చెప్పుకునే కొందరు నాయకుల తీరు శ్రేణులను విస్తుగొలుపుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మానేసి కుయుక్తులతో పార్టీకి నష్టం చేస్తున్నారవే వాదన వ్యక్తం అవుతుంది.

సీఎం అభ్యర్థులుగా అనుచరుల జేజేలు..

డీసీసీలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వీహెచ్, పొంగులేటి, భట్టి, రేణుకా చౌదరితో పాటు ఏఐసీసీ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు ఆరిఫ్ నజీంఖాన్ కూడా హాజరైన ఈ సభ రసాభాసగా మారింది. ఎవరి అనుచరులు వారికి జేజేలు పలకడమే కాకుండా.. సీఎం అభ్యర్థులుగా నినాదాలు చేసుకోవడం వివాదంగా మారింది. మరికొందరు పలానా నియోజకవర్గం అభ్యర్థి మా వాడే అంటూ నినదించడం చినికిచినికి గాలివానగా మారింది. ఎవరికివారు అనుచరులకు సర్ధిచెప్పినా వినని పరిస్థితి నెలకొంది. అనేక వివాదాల్లో తలదూర్చేవారు, నెలల తరబడి జిల్లాకు రానివారు, అవకాశవాద రాజకీయాలు చేసేవారు తమకు చెప్పడమేంటంటూ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గలాట చేశారు.

గ్రాఫ్ పెరిగినా.. గొడవలు తగ్గలే..

వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరిగింది. నియోజకవర్గాల్లో పోటీచేసే నాయకుల సంఖ్య పెరిగింది. పొంగులేటి ఏర్పాటు చేసే సమావేశాలూ విజయవంతంగా సాగుతున్నాయి. జిల్లాలోని నాయకులందరినీ కలుపుకుపోతూ.. పార్టీ విజయానికి తాపత్రయ పడుతుంటే పొంగులేటి చేరికను జీర్ణించుకోని కొందరు సీనియర్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు, వివాదాలు క్రియేట్ చేస్తున్నట్లు పొంగులేటి అనుచరులు ఆరోపిస్తున్నారు. తమ రాజకీయ ప్రాభల్యానికి పొంగులేటి అడ్డుగా మారుతాడని భావించే లేనిపోని గొడవలు చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో విభేదాలు మాని కష్టపడి పనిచేయాల్సింది పోయి.. పార్టీ ప్రతిష్టను బజారులో వేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.

గెలిచిన వారిని నిలుపుకోలేక..

2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల అందులో నలుగురు అధికార పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలారు. గత ఎన్నికల్లో గెలిచిన పార్టీని వీడి అధికార పార్టీలో చేరిన వారిని కట్టడి చేయడంలో స్థానిక నాయకత్వం ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు ఆనాడే వచ్చాయి. సీనియర్లుగా చెప్పుకునే నాయకులు ఎంత కాలం సీట్ల కోసం, పదవుల కోసం కుస్తీ పడ్డారే తప్పా.. పార్టీ బలోపేతం చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే ఆరోపణలు చేశారు.



Next Story

Most Viewed