రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్‌పై రేవంత్ రియాక్షన్

by Disha Web Desk 2 |
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్‌పై రేవంత్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు బంధు నిధుల జమకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ బంధం మరోసారి బయటపడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీది ఫెవికాల్ బంధం బలపడిందని రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ కు సహకరించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చేలా బీజేపీనే చేసిందని ఆరోపించారు. శనివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని పోలింగ్ కు 4 రోజుల ముందు రైతుబంధు డబ్బులు వేస్తున్నారని, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని బీఆర్ఎస్ చూస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జనవరిలో రైతుబంధు వేస్తామని ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ వేస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఏది ఇచ్చిన తీసుకోవాలని తాము అధికారంలోకి వచ్చాక రైతు బంధు డబ్బులు కేసీఆర్ కంటే ఐదు వేలు ఎక్కువే ఇస్తామని చెప్పారు.

వారిద్దరి ప్లాన్ ప్రకారమే మా నాయకులపై దాడులు:

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మంత్రి కేటీఆర్ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ సలహాదారుడు ఏకే గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు ఉంటే వాటిని వదిలేసి తమ నాయకులపై లాఠీ ఛార్జి చేశారని మండిపడ్డారు. సీఈవో వికాస్ రాజ్ కు తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. బీజేపీకి అనుబంధంగా ఈడీ, ఐటీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారని.. అయితే వారంతా బీజేపీలో ఉంటే మంచివారు లేదంటే రావణాసురులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


Next Story

Most Viewed