సీఎం కేసీఆర్‌తో మంత్రి ఎర్రబెల్లికి పొలిటిక‌ల్ గ్యాప్.. కారణమిదే!

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌తో మంత్రి ఎర్రబెల్లికి పొలిటిక‌ల్ గ్యాప్.. కారణమిదే!
X

దిశ‌, తెలంగాణ‌ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు పొలిటిక‌ల్ గ్యాప్ ఏర్పడిందా..? దైవకార్యాన్ని రాజ‌కీయంగా ఉప‌యోగించుకోబోయి.. మంత్రి లేని త‌ల‌నొప్పి కొనితెచ్చుకున్నారా..? అటు జ‌నంతోపాటు ఇటు పార్టీ అధినేత ఆగ్రహానికి గుర‌య్యారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి మండ‌లం వ‌ల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర‌స్వామి ఆల‌య పునఃప్రారంభోత్సవం, విగ్రహాల పునః ప్రతి ష్ఠాపన కార్యక్రమం ఈనెల 1 నుంచి 4 వ‌ర‌కు వైభ‌వంగా జ‌రిగింది.

ఆల‌య ప్రారంభోత్సవానికి హాజ‌రు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావు స్వయంగా ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం వ‌స్తాన‌ని మాటిచ్చారు. మంత్రి సైతం కేసీఆర్ వస్తున్నారని మీడియాకు ప్రక‌ట‌న ద్వారా తెలియ‌జేశారు. అయితే మ‌రుస‌టి రోజే మంత్రి ఎర్రబెల్లి ఆధ్యాత్మిక గురువుగా కొలిచే చిన్న జీయ‌ర్ స్వామి, ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన మై హోం రామేశ్వర్‌రావును సైతం ఆహ్వానించిన విష‌యం తెలిసి సీఎం కేసీఆర్ కొంత అసంతృప్తికి లోనైన‌ట్లుగా పార్టీ ముఖ్య నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. చిన్న జీయ‌ర్‌ స్వామికి, సీఎం కేసీఆర్ మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా మంత్రి ఎర్రబెల్లి వ్యవ‌హ‌రించిన తీరుపై సీఎం అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నట్లు స‌మాచారం.

మంత్రి విఫలయత్నం..

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన విగ్రహాల పునఃప్రతిష్ఠాపన దేవాలయ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర మంత్రులు టి.హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ప‌విత్ర పుణ్యక్షేత్ర‌మైన వ‌ల్మిడి శ్రీ సీతారాముల ఆల‌య పునః ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు రాజ‌కీయ ఉనికి చాటుకునేందుకు విఫ‌ల‌య‌త్నం చేశార‌న్న విమ‌ర్శ‌లు వ్యక్తమ‌వుతున్నాయి. ఆల‌య ప్రారంభోత్సవం సంద‌ర్భంగా జ‌న‌గామ జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల‌కు సెల‌వు ప్రక‌టించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శన‌మంటూ విమ‌ర్శిస్తున్నారు.



Next Story

Most Viewed