టీ పాలిటిక్స్‌లోకి మళ్లీ ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. రేపు తుమ్మలతో మంత్రాంగం

by Dishafeatures2 |
టీ పాలిటిక్స్‌లోకి మళ్లీ ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. రేపు తుమ్మలతో మంత్రాంగం
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింతగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతలతో పాటు ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేసింది. వీలైనంత మంది నేతలను చేర్చుకుని పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగేలా అడుగులు వేస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడంలో డీకే వ్యూహలు బాగా పనిచేశాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన సేవలను కాంగ్రెస్ హైకమాండ్ వినియోగించుకుంటోంది. నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలను డీకేకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇప్పటికే షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో డీకే సక్సెస్ అయ్యారు. అలాగే పార్టీలో చేరాలనుకునే వివిధ నేతలతో కూడా డీకే చర్చలు జరుపుతున్నారు.అందులో భాగంగా శనివారం తుమ్మల నాగేశ్వరరావుతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. బెంగళూరులో జరగనున్న ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

తుమ్మల చేరిక లాంఛనమే..!

ఇప్పటికే రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బెంగళూరు వెళ్లారు. రేపు డీకేతో భేటీ అనంతరం తుమ్మల కాంగ్రెస్ చేరికపై మరింత క్లారిటీ రానుంది. ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో తుమ్మల హస్తం గూటికి చేరతారని ప్రచారం సాగుతోంది. గురువారం హైదరాబాద్‌లో తుమ్మలతో రేవంత్ రెడ్డితో పాటు పలువరు కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ పరిణామాల అనంతరం శనివారం డీకేతో భేటీ కానుండటంతో తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. ఈ భేటీలో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, నేతల చేరికలపై డీకే శివకుమార్ ఆరా తీయనున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలతో డీకే స్వయంగా చర్చలు జరపనున్నారు.



Next Story

Most Viewed