ఎలక్షన్ షెడ్యూల్‌కు ముందు కేబినెట్ మీటింగ్.. ముఖ్యమైన అంశాలివే!

by Disha Web Desk 2 |
ఎలక్షన్ షెడ్యూల్‌కు ముందు కేబినెట్ మీటింగ్.. ముఖ్యమైన అంశాలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు స్టేట్ క్యాబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రోజు రోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతున్నదని ఆ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో జరిగే చర్చలు, చేసే తీర్మానాలపైనే బీఆర్ఎస్ నేతల దృష్టి ఉన్నది. ఎలాంటి కొత్త హామీలు తెరమీదకు వస్తాయో.. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఎలాంటి ప్రకటన వెలువడుతుందో.. కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్‌కు దీటుగా ఎలాంటి స్కీమ్‌ ఉనికిలోకి రానున్నదో.. అనే విషయాలే బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చర్చ సాగుతున్నది. నవంబర్‌లో రిలీజ్ కావాల్సిన రైతుబంధు, పెండింగ్‌లో ఉన్న దళితబంధుకు ఏ మేరకు ఫండ్స్ రిలీజ్ కానున్నాయో కూడా ఈ మీటింగ్‌లో తేలనున్నది.

బీఆర్ఎస్ వర్గాల్లో ధీమా..

ఎన్నికల ముందు జరుగుతున్న మీటింగ్ కావడంతో వివిధ సెక్షన్ల ప్రజలను ఆకట్టుకునేలా చర్చలు, నిర్ణయాలు ఉంటాయనే ధీమా బీఆర్ఎస్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నది. రైతులకు పింఛన్ ఉండొచ్చనే విశ్వాసం వ్యక్తమవుతున్నా దానిపై నిర్ణయం జరుగుతుందా?.. లేక ఎరువుల్ని ఉచితంగా ఇచ్చే స్కీమ్‌ కొత్తగా ఉంటుందా?.. లేక వంట గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ భరించే హామీని ఇస్తుందా ? ఇలాంటి వాటిపైనే గులాబీ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. కీలకమైన మీటింగ్‌గా భావిస్తున్నందున నిర్ణయాలు కూడా ప్రజల్లో చర్చ జరిగేలా, భరోసా కలిగించేలా ఉంటాయన్న ధీమా వారిలో వ్యక్తమవుతున్నది.

మళ్లీ గవర్నర్ వద్దకు వారిద్దరి పేర్లు!

నామినేటెడ్ కోటా కింద ఇద్దరి పేర్లు ప్రతిపాదించి ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఆమోదం తెలిపేలా ప్రభుత్వం పంపిన ఫైల్‌కు గవర్నర్ కొన్ని కొర్రీలు పెట్టి రిటర్న్ చేసిన విషయం తెలిసిందే. క్యాబినెట్‌లో దీనిపై చర్చించి మరోసారి వారిద్దరి పేర్లను పూర్తి వివరాలతో పంపించొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం (నామినేటెడ్ కోటా) లభించినందున వీరిద్దరి విషయంలో మరో రకమైన నిర్ణయం ఎందుకు జరిగిందనే అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఉదాహరణలను కూడా జోడించాలన్న చర్చ బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్నది. ఈ దిశగా క్యాబినెట్ మీటింగ్‌లో స్పష్టత లభించే అవకాశం ఉన్నది.

మీటింగ్‌లో ముఖ్యమైన అంశాలు

అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు, కొత్త స్కీమ్‌లకు మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి కావడంతో ఆ దిశగానే ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత సమావేశంలో 50కు పైగా అంశాలను ఎజెండాలో పెట్టుకున్న తరహాలోనే ఈసారి భేటీలోనూ ముఖ్యమైన అంశాలు ఉండొచ్చని సమాచారం. తొలుత క్యాబినెట్ సమావేశాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించేలా ప్రాథమిక స్థాయిలో నిర్ణయం జరిగినా సీఎం అనారోగ్య కారణంగా వాయిదా పడిందని, అన్ని అనుకూలిస్తే అక్టోబర్ 1న జరుగుతుందని, లేదా ఫస్ట్ వీక్‌లో జరగొచ్చని సచివాలయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, పెండింగ్‌లో ఉన్న డీఏపై క్లారిటీ కూడా ఈ మీటింగ్‌ ద్వారానే వస్తుందని ఉద్యోగ సంఘాలు ధీమాతో ఉన్నాయి.

మేనిఫెస్టో అంశాలను దృష్టిలో పెట్టుకొని..

బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాబినెట్ భేటీలో ఎజెండా ఉండొచ్చని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి, చేతివృత్తులకు చేయూత, మైనార్టీలకు రూ.లక్ష సాయం.. ఇలాంటి పలు పథకాలు లాంఛనంగా మొదలైనా వాటికి అవసరమైన నిధుల కేటాయింపు, అమలును వేగవంతం చేయడం తదితరాలపైనా క్యాబినెట్ భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నది. కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్‌లో మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు తదితర పలు సెక్షన్లను టచ్ చేస్తూ హామీలు ఇచ్చినందున అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశమున్నది.



Next Story

Most Viewed