తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సంచలన నిర్ణయం?

by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సంచలన నిర్ణయం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో బీసీ లీడర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే రెబల్స్ గా పోటీకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. జనాభా దామాషా ప్రకారం కాకపోయినా.. పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చిన ప్రతి పార్లమెంట్ లో రెండు చొప్పున 34 స్థానాలు ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. అంతకంటే తక్కువ ఇస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఏళ్ల తరబడి నుంచి పార్టీ కోసం శ్రమిస్తుంటే.. పారచూట్ నేతలకు సీట్లు ఇవ్వడం ఏందని? ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న రెడ్డి, వెలమ నేతలు కేసీఆర్, హరీష్​రావు, కేటీఆర్ లపై పోటీ చేయాలని బీసీలు సవాల్ విసురుతున్నారు.

ఇదే విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ థాక్రే కు బీసీ లు వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. 4 రోజులుగా బీసీ నేతలు ఢిల్లీలోనే పార్టీకి చెందిన వివిధ జాతీయ స్థాయి నేతలను కలిసి టిక్కెట్లపై రిక్వెస్టులు పెడుతున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తున్న తమ టిక్కెట్లపై కూడా స్పష్టత ఇవ్వకపోతే ఎలా? అంటూ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్​, మహేశ్​ కుమార్​ గౌడ్​, చెరుకు సుధాకర్, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు కేసీ ముందు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీసీలు ఆగ్రహాన్ని పరిశీలించిన కేసీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

సర్వేల ప్రకారం 25 నుంచి 30 సీట్లు...!

కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీసీ నేతలు కేవలం 25 నుంచి 30 స్థానాల్లోనే గెలిచే ఛాన్స్ ఉన్నదని హైకమాండ్ కు రిపోర్టు వెళ్లింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆ సంఖ్యలోనే సీట్లు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న బీసీ నేతలు ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టు సంస్థ కేవలం రెడ్లకే అనుకూలంగా రిపోర్టులు ఇస్తుందని, బీసీలపై వివక్ష చూపే ప్రయత్నం చేస్తన్నదని బీసీ నేతలు ఫైర్ అవుతున్నారు. తమకు అన్యాయం చేయాలని చూడొద్దని కోరుతున్నారు.

పవరే లక్ష్యం..?

కులాల వారీగా టిక్కెట్లు ఇవ్వడం కంటే తమకు అధికారమే లక్ష్యం అంటూ ఏఐసీసీ చెప్పినట్లు ఓ బీసీ నేత తెలిపారు. సర్వేల్లో ఎవరు ముందంజలో ఉంటారో వాళ్లకే టిక్కెట్లు కేటాయించనున్నారు. పవర్ లోకి వచ్చాక సీనియర్లందరికీ పదవులు వస్తాయని ఏఐసీసీ చెబుతున్నది. తెలంగాణకు చెందిన ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో మంత్లీ, 15 రోజులు అంటూ వేర్వేరుగా సర్వేలు చేశామని, వాటిలో బెస్ట్ ఫార్మామెన్స్ ఉన్నోళ్లకే టిక్కెట్లు లభిస్తాయని ఏఐసీసీ బీసీ నేతలతో వివరించింది. కేసీ చర్చల సమయంలో ఢిల్లీకి వెళ్లిన అభ్యర్థుల సర్వే ఫలితాలను పేర్లు వారీగా స్ట్రాటజిస్టు సంస్థ వినిపించింది. దీంతో కొందరు బీసీ నేతలు కూడా అంగీకరించాల్సి రాగా.. మరి కొందరు సీట్లపై పట్టువీడటం లేదు. మరోవైపు సర్వే ఫలితాలను సీరియస్‌గా తీసుకొని గెలిచే క్యాండిడేట్లకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని పార్టీ నొక్కి చెప్పింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై బీసీలు మరింత ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

Next Story