కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. IT దాడులపై పొంగులేటి కామెంట్స్

by Disha Web Desk 2 |
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. IT దాడులపై పొంగులేటి కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాపై కక్షకట్టి బందిపోట్లు ఇంటిమీద పడ్డట్టుగా నాపై, నా బంధువుల ఇళ్లు, సంస్థలపై ఐటీ దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. నారాయణపురంలో 83 ఏళ్ల నా తల్లి నివాసం ఉంటున్న ఇంటిలో కూడా ఎంత బీభత్సం చేయాలో అంత బీభత్సం చేశారని కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారని అన్నారు. 29 చోట్ల సోదాలు జరిపితే 2 చోట్ల ముగిశాయని చెప్పారు. తన వద్ద భారీగా డబ్బులు ఉన్నాయని ఏదో దుష్ప్రచారం చేసి చివరకు లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారన్నారు. నా ఉద్యోగులను, బంధువులను హౌస్ అరెస్ట్ చేశారని వారిలో కొంతమందిపై చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఎవరెవరిని కొట్టి ఏమేం రాయించుకున్నారో మరికొద్దిసేపట్లో తెలుస్తుందన్నారు.

ఖమ్మం ఇళ్లు, నారాయపురంలో తనిఖీలు చేసి డాక్యుమెంట్లు తీసుకుని నా సతీమణి, నా కుమారుడు, నా తమ్ముడిని ఐటీ అధికారులు వారి కారులోనే హైదరాబాద్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. నా అనుచరుల రియాక్షన్‌కు భయపడి నన్ను హైదరాబాద్ తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేశారన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి ప్రచారానికి కూడా నన్ను వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరే రోజే తనకు ఇలాంటి దాడులు జరుగుతాయని తనకు తెలుసని తన కార్యకర్తలను కాపాడుకునే విషయం తనకు తెలుసన్నారు.

తప్పు చేయలేదు కాబట్టే నేను ధైర్యంగా ఉన్నానన్నారు. ఐటీ దాడులను చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని స్పష్టంగా అర్థం అవుతోందన్న పొంగులేటి.. అధికారంలోక రాబోయే కాంగ్రెస్‌ను నామినేషన్ల ప్రక్రియ నుంచే అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అన్నారు. దర్యాప్తు సంస్థలు రెయిడ్స్ చేయడానికి కేవలం కాంగ్రెస్ నాయకులే కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తనిఖీలు ఎందుకు జరగడం లేదన్నారు. అధికారంలో ఉండి లక్షలాది కోట్లు దోచుకుంటున్న బీఆర్ఎస్ నేతలను వదిలేసి పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలపై పడుతున్నారని దుయ్యబట్టారు.



Next Story

Most Viewed