చిన్నదొర.. రాజీనామా ఎందుకు? మీరు సల్లంగుండాలి

by Disha Web Desk 2 |
చిన్నదొర.. రాజీనామా ఎందుకు? మీరు సల్లంగుండాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్​తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆదివారం ట్విట్టర్​వేదికగా విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ కంటే బెటర్​పథకాలు చూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ చేయడంపై ఆమె సెటైర్లు వేశారు. రాజీనామా ఎందుకు.. చిన్న దొర సల్లంగుండాలంటూ ఆమె ఎద్దేవా చేశారు. అయినా మంత్రి కేటీఆర్​రుణమాఫీ చేయడం లేదని రాజీనామా చేస్తారా? రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించట్లేదని రాజీనామా చేస్తారా?, రైతు బీమా రైతులకు అందిస్తలేరని రాజీనామా చేస్తారా? అని షర్మిల చురకలంటించారు.

కౌలు రైతును రైతుగానే గుర్తించడంలేదని, నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవకని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? అని ఆమె నిలదీశారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని మంత్రి రాజీనామా చేస్తారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? అంటూ షర్మిల ఫైరయ్యారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? అంటూ షర్మిల ప్రశ్నించారు. అయినా కేటీఆర్​ఎందుకు రాజీనామా చేస్తారని, ఆయన సల్లంగుండాలని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రం మాత్రం రావణకాష్టం కావాలని, ఇదే తెలంగాణ ప్రభుత్వ అద్భుత పాలన అంటూ వ్యంగ్యాస్త్రాలు ఆమె సంధించారు.

Next Story

Most Viewed