కేసీఆర్ను గద్దె దింపేది వాళ్లే.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

by Javid Pasha |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించేది ఉద్యోగులేనని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యోగులను తీవ్రంగా మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న కేసీఆర్.. తేనె పూసిన కత్తితో వాళ్ల కడుపులు కోస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకూ లేదని అన్నారు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారని, ఒక చేతితో అవార్డులు పెడుతూ మరో చేతితో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా దొరగారు మత్తు వీడటంలేదన్నారు.

‘నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు. కానీ కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులేనని ఆమె అన్నారు. ఇకనైనా కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, చేసిన తప్పులకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని, లేకుంటే వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.Next Story

Most Viewed