తెలంగాణలో పరిస్థితి చేదాటిపోయింది.. కేంద్ర హోంమంత్రికి షర్మిల విజ్ఞప్తి

by Disha Web Desk 2 |
తెలంగాణలో పరిస్థితి చేదాటిపోయింది.. కేంద్ర హోంమంత్రికి షర్మిల విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందడం లేదని, పరిశీలనకు వెళ్తే అడ్డుకుంటున్నారని, దమ్ముంటే అందరికీ కాకున్నా తన ఒక్కదానికైనా పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పేదలకు వైద్యం అందడంలేదనే సమాచారంలో ఆస్పత్రి సందర్శనకు షర్మిల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం అక్కడికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమెను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకు వెళ్లనివ్వరని పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో షర్మిల కింద పడిపోయింది. పోలీసుల తీరుకు నిరసనగా ఆమె ఇంటి ఎదుటే బైఠాయించింది. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ఆమె ఫైరయ్యారు.

ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని, ప్రజల పక్షాన గొంతు వినిపించినా అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో జరుగుతున్న ఈ దుస్థితిపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ నియంత అనేది మరోసారి ఈ ఘటనతో నిరూపితమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు భయపడుతున్నాడని, అందుకే ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని షర్మిల విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉస్మానియా పరిశీలనకు జనతా రైడ్ కి పిలుపునిచ్చినట్లు ఆమె చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని కేసీఆర్ బతకనివ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

మొన్నటికి మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సైతం అలాగే హౌజ్ అరెస్ట్ చేశారన్నారు. ప్రజల కోసం ప్రతిపక్షాలు నిలబడటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ఆపేందుకు పోలీసులు శాంతి భద్రతలను సాకుగా చూపడంపై షర్మిల విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక దిక్టేటర్ అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిని పడగొట్టి రూ.200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం తొమ్మిదేండ్ల క్రితం హామీ ఇచ్చారని, ఎందుకు నెరవేర్చలేదని ఆమె ప్రశ్నించారు.

Next Story

Most Viewed