దమ్ముంటే సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వు.. సీఎం కేసీఆర్కు వైఎస్ షర్మిల సవాల్

by Javid Pasha |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: దమ్ముంటే సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ గెలిస్తే కేసీఆర్ పాలన బాగుంగదని తాను అనుకుంటానని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి సీఎం పీఠం ఎక్కిన కేసీఆర్.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో మళ్లీ గెలిచారని అన్నారు. కానీ ఈ తొమ్మిదేండ్లలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎగ్గొట్టారని అన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, కబ్జాలకు కొదువలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఉద్యమకారులను పక్కనపెట్టి.. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కట్టారని మండిపడ్డారు.

‘ఇన్నాళ్లు దొర గారు దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారు. కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చితకబాదారు. ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న దొర గారు ఉలిక్కిపడుతున్నారు. సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని తెలుసుకున్నాడు’ అని అన్నారు.

కేసీఆర్ ది అవినీతిరహిత పాలనే అయితే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినవారే అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గనుక సిట్టింగులు మళ్లీ గెలిస్తే కేసీఆర్ పాలనకు అది రెఫరెండం అని తాము భావిస్తామని చెప్పారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.Next Story

Most Viewed