తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై వినోద్ కుమార్ సీరియస్

by Disha Web Desk 2 |
తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై వినోద్ కుమార్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారుల విషయంలో, రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసే విషయంలోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో గందరగోళ పరిస్థితులు నెలకొల్పేందుకు, రాజకీయంగా అస్థిరతను సృష్టించేందుకు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేందుకు, యువతలో మతతత్వ బీజాలు నాటేందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి అటల్ బిహారీ వాజ్పాయ్, లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ కాదు.. ఇప్పుడు ఉన్నది కుట్రలు, కుతంత్రాల బీజేపీ అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, బీజేపీ దేశంలో చిచ్చు రేపుతోందిమండిపడ్డారు. మోడీ చెబుతున్నట్లుగా ఏంపవరింగ్ తెలంగాణ కాదు అని, డీ - స్టాబులైజేశన్ తెలంగాణ అని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన 14 జాతీయ రహదారుల మంజూరు అంశం గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, సూత్రప్రాయంగా అంగీకరించిన ఈ జాతీయ రహదారులను రాష్ట్ర పర్యటన సందర్భంగా మోడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన జాతీయ రహదారులను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల్లో, కొత్త 24 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు అత్యంత ఆవశ్యక అవశ్యకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే లైన్లు ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బెవరేజైస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed