‘వట్టె జానయ్యను సూర్యాపేటలో బరిలోకి దింపుతాం’

by Disha Web Desk 4 |
‘వట్టె జానయ్యను సూర్యాపేటలో బరిలోకి దింపుతాం’
X

దిశ, సూర్యాపేట : ప్రజాభీష్టం మేరకు డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ వట్టే జానయ్య యాదవ్‌ని సూర్యాపేట నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. జానయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీల పక్షాన బలమైన నాయకుడన్నారు. ఆయనను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

రాజకీయాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అటువంటి వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీసీలను అణగారిన వర్గాలుగా చూసే పార్టీలకు మనుగడ ఉండదని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆయన పార్టీలోని బీసీ నాయకులతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా టికెట్లు కేటాయించి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఖమ్మం నుండి హైదరాబాద్ వెళుతూ సూర్యాపేటలోని గాంధీ నగర్‌లో వట్టె జానయ్య యాదవ్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

జాతీయ, ప్రాంతీయ పార్టీలు తక్కువ శాతం ఉన్న అగ్రకులాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆర్థికంగా బలపడిన బీసీలకు మొండి చేసి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పార్టీల నాయకులు వచ్చే ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు. జానయ్య యాదవ్‌ను సూర్యాపేట ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు తనకు ఫోన్ ద్వారా సంప్రదించినట్లు చెప్పారు. వచ్చే నెలలో సూర్యాపేటలో 50 వేల మందితో బీసీ జన గర్జన సభను నిర్వహించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలో అగ్రకులాలే కాదు బీసీలకు కూడా సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, నాయకులు వట్టె కృష్ణ యాదవ్, బారి అశోక్, గాలి శ్రీనివాస్, రామకృష్ణ, పగుళ్ల జనార్ధన్, మహేష్ చారి, సతీష్ కుమార్, వెంకన్న, అలిమ్, సైదులు, చాంద్ పాషా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed