కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘కరువు’ ట్వీట్లు..! కరువు పూడ్చలేనిదని కాంగ్రెస్ సంచలన కౌంటర్స్

by Disha Web Desk 14 |
కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘కరువు’ ట్వీట్లు..! కరువు పూడ్చలేనిదని కాంగ్రెస్ సంచలన కౌంటర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య తాజాగా మరోసారి ట్వీట్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఇరు పార్టీలు సెటైర్లు విసురుకుంటున్నాయి. 'తలాపునే పారుతోంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అన్నట్లుగా ఉన్నది కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు రైతుల పరిస్థితి అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పదేళ్లుగా పసిడి పంటలు పండించిన రైతులు మళ్లీ బీళ్లవుతున్న భూములను చూసి, ప్రాజెక్టు కిందనే పొలాలు ఉన్నా సాగునీరు అందని దుస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, పంటలను కాపాడుకునేందుకు చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలంటూ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది.

అయ్యా కొడుకు బాధ తీర్చలేనిది

కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ మరోట్వీట్‌ చేసింది. కాంగ్రెస్ వచ్చింది.. కడుక్కునే రోజులు పోయి, తుడుచుకునే రోజులు వచ్చాయి.. అని విమర్శించింది. ఈ ట్విట్టర్ పోస్టులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. కారుకు కరువు.. తెలంగాణలో కరువైనా.. కష్టమైనా ఉందంటే అది బీఆర్ఎస్ కి మాత్రమే నని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఏది దొరికితే అది దోచేయడం అలవాటైన ప్రాణానికి పెద్ద కష్టమే వచ్చి పడిందని, ఆ కరువు పూడ్చలేనిది.. ఈ అయ్యా కొడుకు బాధ తీర్చలేనిది.. అని తీవ్రస్థాయిలో విమర్శించింది. మరో ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ముచ్చట్లు తప్ప ఏమీ లేని మురికి పాలన మీది. మీరా ఇందిరమ్మ రాజ్యాన్ని నిందించేది? తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 11.121 బీసీఎంలు కాగా.. ప్రస్తుతం కేవలం 2.815 బీసీఎంలు (25 శాతం) మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్ర జల సంఘం స్పష్టంగా చెప్తుంది. ఆ మురికి నోటితో నిందించాల్సింది ఇందిరమ్మ రాజ్యాన్ని కాదు.. మీ దోపిడీ రాజ్యాన్ని.. అని కౌంటర్ ట్వీట్‌లో కాంగ్రెస్ పేర్కొంది.

Next Story

Most Viewed